జాతీయ విద్యావిధానంపై కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు

3 Aug, 2020 08:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కొత్త విద్యా విధానంలో ప్రాథమిక మానవాభివృద్ధి లక్ష్యం లోపించిందని, జ్ఞాన విస్తరణ లేదని వ్యాఖ్యానించింది. ఈ నివేదికలో మాటలే తప్ప స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ గానీ, ఆర్థిక వనరులుగానీ లేవని విమర్శించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో కాంగ్రెస్‌ నేతలు ఎంఎం పల్లంరాజు, రాజీవ్‌ గౌడ, రణదీప్‌ సూర్జేవాలాలు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తును మార్చబోయే నిర్ణయాన్ని పార్లమెంటులో చర్చించి నిర్ణయాలు తీసుకోకుండా, నిపుణుల సలహాలు లేకుండా కేవలం ఆర్‌ఎస్‌ఎస్‌ సలహాలు తీసుకొని తయారు చేశారని ఎద్దేవా చేశారు. ఈ పాలసీ మధ్యతరగతి కుటుంబాలకు అందదని, సమాజానికి నిరుపయోగమని పేర్కొన్నారు. (పాఠశాల, ఉన్నత విద్యలో భారీ సంస్కరణలు)

కోవిడ్‌ కారణంగా పాఠశాలలు, విద్యా సంస్థలు అన్నీ మూసి ఉన్నప్పుడు కేంద్రం ఈ విధానాన్ని ప్రకటించిందని, అసలు ప్రశ్న ఇక్కడే ప్రారంభమవుతోందని కాంగ్రెస్‌ నేతలు అన్నారు.  ప్రభుత్వం విద్య మీద జీడీపీలో 6 శాతం ఖర్చుపెడతామని చెప్పి ఇప్పుడు 3.2 శాతానికి ఎందుకు దిగి వచ్చిందని ప్రశ్నించారు. దీని వల్ల భవిష్యత్తులో తప్పకుండా సమస్యలు వస్తాయని మాజీ మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి పల్లం రాజు చెప్పారు. ఈ విధానానికి రోడ్‌ మ్యాప్‌ ఏమిటని, నిధులు ఎక్కడ నుంచి తెస్తారని వారు ప్రశ్నించారు. నిధులను ప్రజల జేబుల నుంచి లాగుతారా అంటూ ఐఐఎం మాజీ ఫాకల్టీ రాజీవ్‌ గౌడ ప్రశ్నించారు. నిధులు లేకుండా ఈ పాలసీ కాగితం మీదే ఆగిపోతుందని, ఖాళీగా ఉన్న 12 లక్షల టీచర్ల పోస్టులను ఎలా నింపుతుందో, ప్రభుత్వం చెప్పాలని రణదీప్‌ సూర్జేవాలా అడిగారు. దేశంలో 10 శాతం స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్, అందులోనూ 4 శాతం స్కూళ్లకు మాత్రమే నెట్‌ కనెక్టివిటీ ఉందని చెప్పారు.

చదవండి: ఉద్యోగ సృష్టికర్తలొస్తారు..

>
మరిన్ని వార్తలు