కాంగ్రెస్‌కు విజన్‌ లేదు.. గెలిచేంత సీన్‌ లేదు.. ‘హస్తం’ సీనియర్‌ నేత షాకింగ్‌ కామెంట్స్‌

28 Sep, 2022 14:47 IST|Sakshi

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. ఇప్పటికే సీనియర్‌ నేతలు హస్తం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని వీడిన అనంతరం వారు పార్టీ అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. 

మరోవైపు.. కొద్ది రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజాగా హాస్తం పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సీనియర్ లీడర్‌ హర్ష మహాజన్‌ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, కాషాయతీర్థం తీసుకున్నారు. కాగా, ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ సహా పార్టీ సీనియర్‌ నేతల సమక్షంలో మహాజన్‌ బీజేపీలో చేరారు. ఇక, మహాజన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున.. చంబా అసెంబ్లీ నియోజకవర్గం నుండి 1993, 1998, 2003 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.

ఈ సందర్భంగా మహాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను సుమారు 45 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నాను. ఇప్పటి వరకు నేను ఎన్నికల్లో ఓడిపోలేదు. దివంగత మాజీ కాంగ్రెస్‌ సీఎం వీరభద్ర సింగ్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కానీ, నేడు కాంగ్రెస్ దిశానిర్దేశం లేకుండా ఉంది. ప్రస్తుత కాంగ్రెస్‌కు నాయకత్వం లేదు, ముందుచూపు లేదు.  వీరభద్ర సింగ్‌ మృతిచెందిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు. హిమాచల్‌లో కాంగ్రెస్‌ గెలవదు. మళ్లీ బీజేపీనే గెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకుళ్తున్నారు. బీజేపీ అద్భుత పాలన అందిస్తోంది’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు