దేశం పేరు మారితే ఆ వెబ్‌సైట్లకు కష్టాలు

6 Sep, 2023 07:39 IST|Sakshi

ఢిల్లీ: ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. ఎందుకంటే చాలా వెబ్‌సైట్లు తమ పేర్లలో .ఇన్‌ అనే డొమైన్‌ను వాడుతున్నాయి. ఇన్నాళ్లూ ఇండియా పేరు ఉంది కాబట్టే ఇండియా స్పెల్లింగ్‌లోని తొలి రెండు అక్షరాలు అయిన ఐఎన్‌లను ఆయా వెబ్‌సైట్ల పేరు చివరన పెట్టుకున్నాయి. .ఇన్‌ డొమైన్‌ను కంట్రీ కోడ్‌ టాప్‌ లేయర్‌ డొమైన్‌(టీఎల్‌డీ) అంటారు. దేశం పేరు ఇండియా నుంచి భారత్‌కు మారితే .ఇన్‌ అనే డొమైన్‌ భారత్‌ అనే కొత్త పేరును ప్రతిబింబించదు. అçప్పుడు భారత్‌ అనగానే ఠక్కున స్ఫురించేలా కొత్త టీఎల్‌డీ(డొమైన్‌)కు మారితే బాగుంటుంది. 

భారత్‌ ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌లోని బీహెచ్‌ లేదా బీఆర్‌ ఇంగ్లిష్‌ అక్షరాలతో కొత్త డొమైన్‌ను వాడాలి. అంటే .బీహెచ్‌ లేదా .బీఆర్‌ అని ఉంటే సబబుగా ఉంటుంది. కానీ ఈ రెండు డొమైన్‌లను ఇప్పటికే వేరే దేశాలకు కేటాయించారు. దీంతో వెబ్‌సైట్‌ పేరు చూడగానే ఇది భారత్‌దే అని గుర్తుపట్టేలా ఉండే కొత్త డొమైన్‌ మనకిప్పుడు అందుబాటులో లేదు. అదే ఇప్పుడు అసలు సమస్య. ఎన్‌ఐఎక్సై్స వారు ఇన్‌రిజిస్ట్రీ సంస్థ ద్వారా .ఇన్‌ డొమైన్‌ను రిజిస్టర్‌ చేశారు. ప్రత్యేకమైన అవసరాల కోసం ఇందులోనే సబ్‌డొమైన్‌లను సృష్టించి కొన్ని సంస్థలకు కేటాయించారు. 

ఉదాహరణకు జీఓవీ.ఇన్‌ అనే డొమైన్‌ను భారత ప్రభుత్వ రంగ సంస్థలు వాడుకుంటున్నాయి. ఎంఐఎల్‌.ఇన్‌ అనే డొమైన్‌ను దేశ సైన్యం వినియోగిస్తోంది. ఒక్కో డొమైన్‌ ఒక్కో దేశాన్ని వెంటనే స్ఫురణకు తెచ్చేలా ప్రాచుర్యం పొందాయి. ఉదాహరణకు .సీఎన్‌ అనగానే చైనా వెబ్‌సైట్లు, .యూఎస్‌ అనగానే అమెరికా వెబ్‌సైట్లు, .యూకే అనగానే బ్రిటన్‌ వెబ్‌సైట్లు గుర్తొస్తాయి. భారత్‌లోని చాలా ప్రముఖమైన వెబ్‌సైట్లు సైతం తమ ఐడెంటిటీ(గుర్తింపు)ను నిలబెట్టుకున్నాయి. మార్కెట్లో ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఒక్కసారిగా డొమైన్‌ మారిపోతే కొత్త డొమైన్‌తో ఆయా వెబ్‌సైట్లకు మళ్లీ అంతటి గుర్తింపు రావడం చాలా కష్టం.

.బీహెచ్, .బీఆర్‌ మనకు రావేమో!.బీహెచ్, .బీఆర్‌ అనే భారత్‌కు సరిగ్గా సరిపోతాయి. కానీ ఇప్పటికే .బీహెచ్‌ను బహ్రెయిన్‌ దేశానికి, .బీఆర్‌ను బ్రెజిల్‌ దేశానికి, .బీటీను భూటాన్‌కు కేటాయించారు. దీనికి మరో పరిష్కారం ఉంది. డొమైన్‌లోని అక్షరాలను పెంచుకుని .BHARAT, లేదా .BHRT  అనే కొత్త డొమైన్‌కు తరలిపోవడమే. కొత్త డొమైన్‌కు మారినాసరే ఆయా వెబ్‌సైట్లు పాత డొమైన్‌లనూ కొనసాగించవచ్చు. 

వీటి నిర్వహణలో వచ్చే ఇబ్బందేమీ లేదు. అయితే ఆయా సంస్థల అసలు వెబ్‌సైట్‌ ఏది అనేది గుర్తించడం కష్టమవుతుంది. నకిలీ వెబ్‌సైట్ల బెడద ఒక్కసారిగా పెరిగిపోతుంది. బ్యాంకింగ్‌ రంగంలో ఇలాంటి సమస్య తలెత్తితే ఇక అంతే సంగతులు. కొత్త డొమైన్‌ ప్రాచుర్యం పొందాక పాత డొమైన్‌లకు.. ఇవి ఏ దేశానికి చెందినవబ్బా ? అనే కొత్త అనుమానం నెటిజన్లకు కలిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డొమైన్‌ పేరు సమస్య ఒక్కటే పొంచి ఉంది. నిజంగానే దేశం పేరు మారితే ఇలాంటి కొత్త రకం సమస్యలు ఏమేం వస్తాయో ఇçప్పుడే చెప్పలేం. చూద్దాం.. ఈ డొమైన్‌ల కథ ఏ మలుపు తిరుగుతుందో!

ఇదీ చదవండి: తెరపైకి భారత్‌..!

మరిన్ని వార్తలు