వైరల్‌ వీడియో.. కోవిడ్‌ రోగిపై వైద్య సిబ్బంది దాడి

19 Sep, 2020 11:15 IST|Sakshi

గాంధీనగర్‌: మంచినీళ్లు అడిగినందుకు ఓ కోవిడ్‌ పేషెంట్‌ని నర్సింగ్‌ సిబ్బంది చితకబాదిన వీడియో నిన్నటి నుంచి అన్ని మీడియా చానెళ్లలో ప్రసారం అవుతుంది. ఈ సంఘటన పది రోజుల క్రితం చోటు చేసుకుంది. ప్రస్తుతం బాధితుడు మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలు.. ప్రభాకర్‌ పాటిల్‌ అనే వ్యక్తి రాజ్‌కోట్‌ ప్రాంతంలోని ఓ కంపెనీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షల అనంతరం అతడి కిడ్నీలో నీరు చేరిందని ఆపరేషన్‌ చేయాలని తెలిపారు వైద్యులు. దాంతో ప్రభాకర్‌ రెండు వారాల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరి కిడ్నీ ఆపరేషన్‌ చేయించుకున్నాడు. సమస్య తీరిపోయింది అనుకుంటుండగా.. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దాంతో వైద్యులు అతడికి కరోనా టెస్టులు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ప్రభాకర్‌ సెపప్టెంబర్‌ 8న రాజ్‌కోట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. (చదవండి: ‘ఆ సమయంలో నా బలం, ధైర్యం మీరే’)

ఈ క్రమంలో తాగేందుకు మంచి నీళ్లు ఇవ్వాల్సిందిగా నర్సింగ్‌ సిబ్బందిని కోరాడు. దాంతో వారు ప్రభాకర్‌పై దాడి చేశారు. మీడియాలో తెగ వైరలయిన ఈ వీడియోలో నర్సింగ్‌ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు కలిసి ప్రభాకర్‌ మీద దాడి చేయడం చూడవచ్చు. అతడిని కిందపడేసి కంట్రోల్‌ చేయడానికి ప్రయత్నించారు. ఓ వ్యక్తి ప్రభాకర్‌పై కూర్చుని ఉండగా.. మరొకరు అతడిని చెంప మీద కొట్టారు. కామ్‌గా ఉండమని ఆదేశించారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరో విచారకరమైన విషయం ఏంటంటే.. ప్రభాకర్‌ ఈ నెల 12న మరణించాడు. దీని గురించి అతడి సోదరుడు విలాస్‌ పాటిల్‌ మాటట్లాడుతూ.. ‘గత శనివారం నా సోదరుడు మరణించాడు. అంతకు ముందే సిబ్బంది తనని దారుణంగా కొట్టారు. మరణించిన అనంతరం తన మృతదేహాన్ని కూడా మాకు అప్పగించలేదు. ప్రోటోకాల్‌ ప్రకారం తనకి అంత్యక్రియలు చేయలేదు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం, అమానవీయ ప్రవర్తన కారణంగానే తను మరణించాడు. ఇందుకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని’ విలాస్‌ పాటిల్‌ డిమాండ్‌ చేశాడు. (చదవండి: కరోనా డాక్టర్ల కాసుల దందా)

ఇక దీని గురించి ఆస్పత్రి యాజమాన్యం మాట్లాడుతూ.. సదరు రోగి మెంటల్‌ కండీషన్‌ సరిగా లేదు. వైద్యం చేయడానికి సహకరించడం లేదు. ఈ క్రమంలో తనకు లేదా ఇదరులకు గాయాలు కాకుండా చూడాలనే ఉద్దేశంతోనే తనని అడ్డుకున్నాం తప్ప కొట్టడం, తోయ్యడం వంటివి చేయలేదు అన్నారు. 

>
మరిన్ని వార్తలు