హిందూ దేవుళ్ల విషయంలో అది సాధ్యం కాదా?: ట్విటర్‌కు చురకలు

29 Mar, 2022 13:36 IST|Sakshi

సున్నిత అంశంపై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర కంటెంట్‌ పోస్ట్‌ చేసేవాళ్లపై స్వచ్ఛందంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ట్విటర్‌ను నిలదీసింది. ఈ క్రమంలో మైక్రోబ్లాగింగ్‌ సైట్‌కు చురకలు అంటించింది.  

'AtheistRepublic' అనే ట్విటర్‌ పేజీలో కాళి మాతకు వ్యతిరేకంగా కొన్ని పోస్టులు కనిపించాయి. దీంతో ట్విటర్‌ ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలంటూ పిటిషన్‌ దాఖలైంది. సోమవారం ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అయితే అమెరికాకు అధ్యక్షుడిగా పని చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ విషయంలో ట్విటర్‌ అనుసరించిన తీరును ఈ సందర్భంగా ట్విటర్‌కు గుర్తు చేసింది ఢిల్లీ హైకోర్టు.  ఇలా హిందూ దేవుళ్లపై అభ్యంతరకర పోస్టులు చేసేవాళ్ల అకౌంట్లను ఎందుకు బ్లాక్‌ చేయడం లేదంటూ, చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. అలాగే ఇతర ప్రాంతాల, జాతుల ప్రజల సున్నితత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఆక్షేపించింది.

ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ నవీన్‌ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్లాట్‌ఫారమ్‌లో కొంతమంది వ్యక్తులను బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. అసలు ఖాతాల బ్లాక్‌ను ఎలా చేపడతారో వివరించాల’ని ట్విట్టర్‌ను ఆదేశించింది. అందరి అకౌంట్లు అలా బ్లాక్‌ చేయలేమని ట్విటర్‌ వివరణ ఇవ్వగా.. మరి ట్రంప్‌ అకౌంట్‌ ఎలా చేశారని నిలదీసింది. కంటెంట్‌ సున్నితమైందని, వ్యక్తులు సున్నితమైన వాళ్లని భావించినప్పుడు వాళ్లను బ్లాక్‌ చేశారు కదా. అలాంటప్పుడు ఇక్కడ కూడా సున్నితమైన అంశాలపై పట్టించుకోరా? ఈ తీరు సరైందేనా? అని నిలదీసింది.  

అభ్యంతకర కంటెంట్‌ విషయంలో కేసు, ఎఫ్‌ఆర్‌లు నమోదు అవుతున్నాయని ట్విటర్‌ తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ సిదార్థ్‌ లుథ్రా వెల్లడించారు. ఈ నేపథ్యంలో... ఐటీ యాక్ట్ ప్రకారం.. ప్రస్తుత సందర్భంలో(కేసు విషయంలో) అకౌంట్‌ బ్లాక్‌ చేయడం సబబేనా పరిశీలించాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై తర్వాతి వాదనలను సెప్టెంబర్‌ 6వ తేదీన విననుంది ఢిల్లీ హైకోర్టు.

మరిన్ని వార్తలు