Delhi Liquor Policy Case: ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు

3 Nov, 2023 04:54 IST|Sakshi
సింగ్రౌలీ నియోజకవర్గంలో ఎన్నికల రోడ్‌షోలో పాల్గొన్న కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌

ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు, దురుద్దేశంతో సమన్లు పంపారు

సమన్లు ఉపసంహరించుకోండి

ఈడీకి లేఖ రాసిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో నూతన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు ఆప్‌ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తమ కార్యాలయానికి పిలవగా గరువారం ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు మరో తేదీతో సమన్లు జారీచేసే అవకాశముంది.

విచారణకు పిలిచి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేస్తుందన్న ఆప్‌ ఆరోపణల నడుమ గురువారం ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌ ఎదుట పెద్దసంఖ్యలో ఆప్‌ కార్యకర్తలు గుమిగూడారు. ఉద్రిక్త పరిస్థితుల నివారణ కోసం ముందస్తుగా కేంద్రం పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను ఈడీ ఆఫీస్, బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద మోహరించింది. ఈ కేసును వచ్చే 6–8 నెలల్లోగా తేల్చేయాలని సుప్రీంకోర్టు ప్రాసిక్యూషన్‌ వారికి సూచించిన నేపథ్యంలో ఈడీ ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసే అవకాశముంది.

చట్టవ్యతిరేకం, కక్షపూరితం
ఈడీ ఆఫీస్‌కు గైర్హాజరైన సందర్బంగా దర్యాప్తు సంస్థకు కేజ్రీవాల్‌ ఒక లేఖ రాశారు. ‘ నాకు పంపిన ఈ సమన్లు పూర్తిగా చట్టవిరుద్ధం. కక్షపూరితం. రాజకీయ ప్రేరేపితం. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించింది. వీటిని ఉపసంహరించుకోండి. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇçప్పుడీ సమన్లు పంపారు. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం ఉందని సమన్లు పంపారు? సాక్షిగానా లేక నిందితుడిగానా అనేది అందులో లేదు. ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు పంపారా? లేదంటే ఆప్‌ కన్వీనర్‌ అయినందుకు పంపారా?’ అని లేఖలో కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

‘కేజ్రీవాల్‌కు సమన్లు పంపి అరెస్ట్‌ చేస్తారని బీజేపీ నేతలు అక్టోబర్‌ 30న అన్నారు. అదేరోజు సాయంత్రం యాధృచ్ఛికంగా ఈడీ సమన్లు ఇచ్చింది’ అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు, ఈడీ ఆఫీస్‌కు రాకుండా కేజ్రీవాల్‌ మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో కలిసి సింగ్రౌలీ నియోజకవర్గంలో ఎన్నికల రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ‘నన్ను అరెస్ట్‌చేస్తారని ఢిల్లీ కోడైకూస్తోంది. ఈడీ అధికారులు నన్ను అరెస్ట్‌ చేయగలరుగానీ నా ఆలోచనలను అరెస్ట్‌ చేయలేరుకదా. నా సిద్ధాంతాలతో ఏకీభవించే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది, కోట్లాది అభిమాన కేజ్రీవాల్‌లను అరెస్ట్‌ చేయలేరు’ అని ర్యాలీలో కేజ్రీవాల్‌ అన్నారు.

‘ఇండియా’ కూటమిని దెబ్బతీసేందుకు యత్నం: ఆప్‌
‘ఇండియా’ కూటమిని దెబ్బ కొట్టాలంటే ఢిల్లీలో కొరకరాని కొయ్యలా ఉన్న కేజ్రీవాల్‌ను ముందు అరెస్ట్‌చేయాలనేది బీజేపీ ప్రణాళిక. అలా అయితేనే ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్‌ బలహీననమై సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతుందని బీజేపీ కుట్ర పన్నుతోంది’ అని ఆప్‌ ఆరోపించింది.

నిజాన్ని ఎదుర్కోలేక పారిపోయారు: బీజేపీ
కేజ్రీవాల్‌ గైర్హాజరుపై బీజేపీ ఎద్దేవాచేసింది. ‘ ఎక్సైయిజ్‌ పాలసీ విధానంలో నిజాలను వెల్లడించే ధైర్యం లేకనే కేజ్రీవాల్‌ ఈడీ ఆఫీస్‌కు రాకుండా పారిపోయారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కింగ్‌ ఆయనే’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆరోపించారు. ‘ సాక్ష్యాలు, ఆధారాలుంటేనే ఈడీ సమన్లు జారీచేసి విచారణకు పిలుస్తుంది. మద్యం విధానం గురించి బాగా కేజ్రీవాల్‌కు బాగా తెలుసు. నిజాలు కప్పిపుచ్చే సమర్థత లేకనే, భయంతోనే ఆయన ఈడీ ఆఫీస్‌కు వెళ్లలేదు’ అని ఆయన        ఆరోపించారు.

మరిన్ని వార్తలు