Wrestlers Protest: ఇక నో మోర్‌ పర్మిషన్‌.. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనపై రెజ్లర్లకు పోలీసుల షాక్‌

29 May, 2023 13:07 IST|Sakshi

ఢిల్లీ: జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్ల నిరసన సందర్భంగా నిన్న(ఆదివారం) పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ నిరసనకారుల్ని బలవంతంగా అదుపులోకి తీసుకుని 12 మందిపై కేసులు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు షాక్‌ ఇచ్చారు.

ఇక నుంచి జంతర్‌ మంతర్‌ వద్ద రెజ్లర్ల నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ అనుమతుల కోసం గనుక వాళ్లు దరఖాస్తు చేసుకుంటే.. జంతర్‌ మంతర్‌ కాకుండా వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం ట్విటర్‌ ద్వారా స్పష్టం చేసింది. ‘‘వాళ్లు(రెజ్లర్లు) పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అందుకే జంతర్‌ మంతర్‌ వద్ద వాళ్లు చేపట్టిన నిరసన దీక్ష ముగిసింది!. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో మళ్లీ నిరసనకు దరఖాస్తు చేస్తే.. జంతర్ మంతర్ కాకుండా అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తాం అని డీసీపీ ట్విటర్‌ హ్యాండిల్‌ ద్వారా ప్రకటించింది..

ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సోషల్‌ మీడియా భగ్గుమంది. అయితే.. రెజ్లర్లు అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాల ద్వారా తమ విధులను చేయకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో సహా నిరసనలో పాల్గొన్న రెజ్లర్లందరినీ ఈ కేసులో ప్రస్తావించారు.

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఈ నిరసనలు కొనసాగాయి. మొత్తం 38 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన కొనసాగింది. భూషణ్ శరణ్ సింగ్‌ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేదించారని, అతన్ని అరెస్ట్ చేయాలని, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పటికే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కానీ, రెజ్లర్లు మాత్రం బ్రిజ్‌ను అరెస్ట్‌ చేసే దాకా నిరసనలు ఆపమని చెబుతున్నారు.

Video Source: PTI News

అవి మార్ఫింగ్‌ ఫొటోలు
‘‘అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావడం లేదు. మాకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు’’..

అరెస్టు తర్వాత వ్యానులో వినేష్‌, సంగీత ఫొగాట్‌లు నవ్వుతున్నట్లు ఉన్న ఓ సెల్ఫీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై   రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ పై విధంగా స్పందించారు. 

ఇదీ చదవండి: రాజదండం ఎవరి కోసం?

మరిన్ని వార్తలు