కంగన ఎఫెక్ట్‌: రెండు వారాల పాటు నిషేధం

12 Sep, 2020 17:42 IST|Sakshi

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ బీఎంసీ అధికారులు కూల్చి వేశారు. దాంతో కంగన ఇండిగో విమానంలో హుటా హుటిన ముంబై చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విమానయాన సంస్థలు ఇబ్బందలు ఎదుర్కొనున్నాయి. సెప్టెంబర్ 9న కంగనా ప్రయాణించిన ఇండిగో విమానంలో కోవిడ్-19 ప్రోటోకాల్స్ నిబంధనల ఉల్లంఘించారనే ఆరోపణలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రెగ్యులేటరీ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది. కంగన వచ్చిన విమానంలో చాలామంది మాస్క్‌లు ధరించలేదని, భౌతిక దూరాన్నిపాటించలేదంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక సమర్పించాల్సిందిగా ఇండిగోను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా డీజీసీఏ శనివారం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విమానంలో ఫోటోలు తీసినట్టు గుర్తిస్తే రెండు వారాలపాటు సర్వీసులను నిలిపివేయాల్సి ఉంటుందని డీజీసీఏ విమానయాన సంస్థలను హెచ్చరించింది. (కంగనా ఎపిసోడ్ : ఇండిగోకు నోటీసులు)

నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలను ఎదుర్కోవాల్సిన ఉంటుందని డీజీసీఏ పేర్కొన్నది. ‘డైరెక్టర్ జనరల్, జాయింట్ డైరెక్టర్ జనరల్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ లేదా సివిల్ ఏవియేషన్ విభాగం రెగ్యులేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ లిఖితపూర్వకంగా మంజూరు చేసిన అనుమతి నిబంధనలు, షరతులకు లోబడి తప్ప ఏ వ్యక్తి ఫోటోలు తీయరాదు’ అని డీజీసీఏ శనివారం నాటి ప్రకటనలో తెలిపింది. అంతేకాక ‘ఇప్పటి నుంచి ఏదైనా ఉల్లంఘన జరిగితే ఆ నిర్దిష్ట మార్గంలో  రెండు వారాల పాటు విమాన సర్వీసులు నిలిపివేయబడతాయి. అంతేకాక ఉల్లంఘనకు కారణమైన వారిపై సదరు సంస్థ అన్ని చర్యలు తీసుకున్న తర్వాతే విమాన సర్వీసులు పునరుద్ధరించాల్సి ఉంటుంది’  అంటూ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి ఉల్లంఘన అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్వహించడంలో రాజీకి దారితీస్తుందని డీజీసీఏ వ్యాఖ్యానించింది. (చదవండి: ఒక్క సినిమాతో ఝాన్సీ అయిపోయావా..)

 కంగన ముంబై వస్తున్న సందర్భంగా విమానంలో టీవీ ఛానెళ్ల సభ్యులతో మాట్లాడుతున్న ఒక వీడియోను  ట్విటర్ యూజర్ ఒకరు షేర్ చేస్తూ, ఫేస్ మాస్క్, సామాజిక దూరంపై ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై స్పందించిన డీజీసీఐ ఇండిగోకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై స్పందించిన ఇండిగో తాము నిర్దేశిత నిబంధనలను అన్నీ పాటించామంటూ వివరణ ఇచ్చింది. క్యాబిన్ సిబ్బంది, అలాగే ఫోటోగ్రఫీని పరిమితం చేసే కెప్టెన్   ప్రకటనలతో సహా అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించామని  తెలిపింది

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా