ట్రాఫిక్‌లో పైలట్‌.. ఫ్లైట్‌ లేట్‌..! వీడియో వైరల్‌

30 Nov, 2023 20:36 IST|Sakshi

ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో నిర్వహణను తప్పుపట్టారు. ఇందుకు సంబంధించి శర్మ తన ఎక్స్‌ ఖాతాలో తాజాగా జరిగిన సంఘటన గురించి షేర్‌ చేశారు. అందులోని వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

నవంబర్‌ 29న చెన్నై నుంచి ముంబయి వెళ్లాల్సిన 6ఈ 5149 నంబర్‌ ఇండిగో విమానం దాదాపు గంటకుపైగా ఆలస్యంగా బయలుదేరింది. ఇది షెడ్యూల్ ప్రకారం రాత్రి 8:00 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాత్రి 9:55 గంటలకు ముంబై చేరుకోవాలి. అయితే గూగుల్‌ ఫ్లైట్స్‌ డేటా ప్రకారం దాదాపు నాలుగు గంటలు ఆలస్యం అవుతుందని సూచిస్తూ విమాన బయలుదేరే సమయం నవంబర్ 30 ఉదయం 12:10కు మారింది. అప్పటికే అందులో ఎక్కిన ప్రయాణికులు దాదాపు 180 మంది ఆందోళన చేపట్టారు. వెంటనే సమస్యకు చర్య తీసుకోవాలని కోరినా మేనేజ్‌మెంట్‌ సరిగా స్పందించలేదని ఆయన తెలిపారు. ఆ ప్రయాణికుల్లో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఉన్నారని చెప్పారు. అయితే వారిని వేరే విమానం ఎక్కిస్తామని నమ్మించి మళ్లీ సెక్యూరిటీ వింగ్‌కు తరలించినట్లు చెప్పారు.  

విమానం ఆలస్యం అయినందుకు కారణం అడుగుతున్న ప్రయాణికులకు సరైన సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పైలట్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడంటూ ఇండిగో సిబ్బంది సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ తెలిపారు. ఇండిగో సీనియర్ అధికారితో మాట్లాడాలని కోరుతూ ఎయిర్‌లైన్ గ్రౌండ్ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగిన వీడియోలను శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి: సెల్ఫ్‌మేడ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ 2023 లిస్ట్‌ విడుదల.. ఆయనే టాప్‌..

‘ప్రియమైన ఇండిగో, మీరు మమ్మల్ని బస్సులో 50 నిమిషాలు వేచి ఉండేలా చేశారు. ఇప్పుడు మీ సిబ్బంది.. పైలట్ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాడని అంటున్నారు. మేము రాత్రి 8 గంటలకు బయలుదేరాలి. ప్రస్తుతం రాత్రి 9:20 అవుతుంది. ఇప్పటికీ కాక్‌పిట్‌లో పైలట్ లేడు. ఈ 180 మంది ప్రయాణికులు మళ్లీ ఇండిగోలో ప్రయాణిస్తారని అనుకుంటున్నారా?’ అంటూ తన పోస్ట్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు