యువకుడి పొట్టలో 63 స్టీల్‌ స్పూన్లు.. 2 గంటలు శ్రమించి..!

28 Sep, 2022 20:24 IST|Sakshi

లక్నో:  ఏదైనా ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతేనే.. కడుపులో నొప్పితో సతమతమవుతాం. అలాంటిది ఓ వ్యక్తి ఏడాదిగా స్టీల్‌ స్పూన్లు తింటున్నాడు. పొట్ట నిండా స్పూన్లు ఉన్న ఈ షాకింగ్‌ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడి శరీరంలో ఏకంగా 63 స్టీల్‌ స్పూన్లు ఉండటం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. గంటల తరబడి శస్త్రచికిత్స చేసి చెంచాలను బయటకు తీశారు.

ఏం జరిగింది?
జిల్లాకు చెందిన విజయ్‌ అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దాంతో ఏడాది క్రితం కుటుంబ సభ్యులు డీఅడిక్షన్‌ కేంద్రంలో చేర్పించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆరోగ్యం మరింత క్షీణించగా.. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. కడుపులో స్పూన్లు ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్‌ చేసి 63 చెంచాలను బయటకు తీశారు. అయితే.. స్పూన్లు ఎలా వచ్చాయని డాక్టర్లు ప్రశ్నించగా.. తాను గత ఏడాది నుంచి స్పూన్లు తింటున్నానని విజయం చెప్పటంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

‘ఆ స్పూన్లు నువ్వే తింటున్నావా అని మేము అడిగితే అవునని చెప్పాడు. సుమారు 2 గంటల పాటు ఆపరేషన్‌ చేసి స్పూన్లు తొలగించాం. ప్రస్తుతం అతడు ఐసీయూలో ఉన్నాడు. పరిస్థితి విషమంగానే ఉంది. రోగి సుమారు ఏడాది కాలంగా స్టీల్‌ చెంచాలు తింటున్నాడు.’ అని డాక్టర్‌ రాకేశ్‌ ఖర్రాన్‌ తెలిపారు. మరోవైపు.. డీఅడిక్షన్‌ కేంద్రంలోనే విజయ్‌కి బలవంతంగా స్పూన్లు తినిపించారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

ఇదీ చదవండి: 11కేవీ హైఓల్టేజ్‌ కరెంట్‌ తీగలపై స్టంట్స్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

మరిన్ని వార్తలు