క్రిమినల్‌ బిల్లుల పరిశీలనకు మరింత సమయం

28 Oct, 2023 04:32 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత క్రిమినల్‌ చట్టాల స్థానంలో ప్రతిపాదించిన మూడు కొత్త బిల్లులపై హోం శాఖ కార్యకలాపాల పార్లమెంటరీ కమిటీ భేటీ శుక్రవారం అసంపూర్తిగా ముగిసింది. బిల్లుల డ్రాఫ్ట్‌ల అధ్యయనానికి మరింత సమయం కావాలని కమిటీలోని విపక్ష సభ్యులు కోరారు. స్వల్పకాలిక ఎన్నికల లబ్ధి కోసం వాటిని హడావుడిగా ఆమోదించొద్దని కమిటీ చైర్‌పర్సన్‌ బ్రిజ్‌ లాల్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కమిటీ నవంబర్‌ 6న భేటీ అయ్యే అవకాశముందని చెబుతున్నారు.

విపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆ రోజు వాటిని కమిటీ ఆమోదిస్తుందని సమాచారం. బ్రిటిష్‌ కాలం నాటి నేర న్యాయ చట్టాలను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు మూడు కొత్త బిల్లులను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రవేశపెట్టడం తెలిసిందే.  అనంతరం వాటిని పరిశీలన  కమిటీకి పంపారు. వాటిపై పరిశీలనకు మరింత కావాలంటూ కమిటీలోని విపక్ష సభ్యులు పి.చిదంబరం (కాంగ్రెస్‌), డెరిక్‌ ఒబ్రియాన్‌ (టీఎంసీ) చైర్మన్‌కు లేఖ రాసినట్టు సమాచారం. ముఖ్యంగా ప్రతిపాదిత చట్టాలకు హిందీ పేర్లు పెట్టడాన్ని డీఎంకే వంటి విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటిని పట్టించుకోరాదని కేంద్రం నిర్ణయించినట్టు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు