ఆమ్నెస్టీ ఇండియాకు భారీ షాక్‌.. రూ. 51 కోట్ల ఈడీ పెనాల్టీ, ఆయనకు పది కోట్ల జరిమానా

8 Jul, 2022 18:29 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థకు భారీ షాక్‌ తగిలింది. ఫెమా ఉల్లంఘనల కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం సదరు సంస్థకు భారీ పెనాల్టీ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. కంపెనీ మాజీ సీఈవో ఆకర్‌ పటేల్‌కూ భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. 

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ‘విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం’ (FCRA)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు రుజువు అయ్యాయని చెప్తూ.. ఉల్లంఘనల కింద రూ.51.72 కోట్లను పెనాల్టీని విధిస్తున్నట్లు ప్రకటించింది ఈడీ. అలాగే మాజీ హెడ్‌ ఆకర్‌ పటేల్‌కు సైతం పది కోట్ల రూపాయలను జరిమానాగా విధించింది. 

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి పొందకుండా బ్రిటన్‌లోని సంస్థల నుంచి రూ.36 కోట్లు ఆమ్నెస్టీ స్వీకరించిందని ఈడీ ఆరోపించింది. ఈ సంస్థ వ్యాపార పద్ధతులను ఉపయోగించి ఈ నిధిని సేకరించిందని గతంలోనే పేర్కొంది.  భారతదేశంలో తన ఎన్జీవో కార్యకలాపాలను విస్తరించేందుకు విదేశీ భాగస్వామ్య నియంత్రణ చట్టం (FCRA)ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. 

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఫౌండేషన్ ట్రస్ట్ (AIIFT), ఎఫ్‌సీఆర్‌ఏ క్రింద ఉన్న ఇతర ట్రస్టులకు ముందస్తు రిజిస్ట్రేషన్, అనుమతులను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించినప్పటికీ.. ఇది జరిగిందని ఈడీ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈడీ ఏం న్యాయవ్యవస్థ కాదని.. మళ్లీ పోరాడి కోర్టులో నెగ్గుతామని ఆకర్‌పటేల్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు