దోచిన ప్రతి పైసా కక్కిస్తాం

9 Dec, 2023 04:44 IST|Sakshi

విపక్షాలకు మోదీ హెచ్చరిక

ఏమిటీ కరెన్సీ గుట్టలంటూ ఎక్స్‌లో పోస్టు

న్యూఢిల్లీ: ‘‘ప్రజల నుంచి గతంలో మీరు దోచుకున్న ప్రతి పైసానూ కక్కిస్తా. దాన్నంతటినీ ప్రజలకు తిరిగిచ్చేయాల్సిందే’’ అని విపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ‘ఇది మోదీ హామీ’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహుకు చెందినదిగా చెబుతున్న వ్యాపార సంస్థ నుంచి రూ.200 కోట్లను ఐటీ శాఖ రికవర్‌ చేసిందన్న వార్తను ప్రధాని టాగ్‌ చేశారు. పలు అల్మారాల్లో అరల నిండా పేర్చిన కరెన్సీ నోట్లకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ సైట్లలో వైరల్‌గా మార్చడం తెలిసిందే. ఈ కరెన్సీ నోట్ల గుట్టను దేశ ప్రజలంతా చూడాలని మోదీ కోరారు. తర్వాత నిజాయితీపై కాంగ్రెస్‌ నేతలు దంచే స్పీచులు వినాలంటూ ఎద్దవా చేశారు. పలు ఎమోజీలను కూడా పోస్టుకు జత చేశారు.  

వెడ్‌ ఇన్‌ ఇండియా సంపన్నులకు మోదీ పిలుపు
డెహ్రాడూన్‌: సంపన్నులు డెస్టినేషన్‌ పెళ్లిళ్లకు దేశీయ లొకేషన్లనే ఎంచుకోవాలని మోదీ కోరారు. ఇందుకోసం మేడిన్‌ ఇండియా మాదిరిగానే ‘వెడ్‌ ఇన్‌ ఇండియా’ అంటూ విప్లవమే రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. సంపన్న పారిశ్రామికవేత్తలు తమ కుటుంబాల్లో కనీసం ఒక్క పెళ్లినైనా ఉత్తరాఖండ్‌ వంటి చోటప్లాన్‌ చేయాలని సూచించారు.

తద్వారా ఈ హిమాలయ రాష్ట్రం వెడ్డింగ్‌ డెస్టినేషన్‌గా మారుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. శుక్రవారం ఇక్కడ ఉత్తరాఖండ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌ తొలి సెషన్‌లో మోదీ ప్రసంగించారు. భారత్‌లో సంపన్న వ్యాపార వర్గాలు పెళ్లిళ్లకు విదేశాలనే ఎంచుకోవడం ఫ్యాషన్‌గా మారిందన్నారు. ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. మరి వాటిని చేసుకునేందుకు యువ జంటలు దేవ భూమి ఉత్తరాఖండ్‌కు బదులు విదేశాలకు ఎందుకు వెళ్లడం?’’ అని ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు