ఓ వైపు పాలన..  మరోవైపు పదవులు

9 Dec, 2023 04:38 IST|Sakshi

సీఎం రేవంత్‌ ముందు రెండు కీలక టాస్క్‌లు 

పదేళ్లుగా అధికారంలో లేక పదవుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నేతలు 

పాలన సాగిస్తూనే పదవుల పందేరంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి 

మంత్రివర్గ కూర్పుతో పాటు శాఖల కేటాయింపులోనూ ఢిల్లీ సూచనలే 

నామినేటెడ్‌ పదవుల్లోనూ జోక్యం చేసుకోనున్న హైకమాండ్‌? 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు కీలక టాస్క్లు ఎదుర్కోబోతున్నారు. ఓ వైపు పాలనతో పాటు మరోవైపు పదవుల పందేరం కూడా ఆయనకు పెద్ద పరీక్షగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేక పదేళ్లు కావడం, తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి రావడంతో వేలాది మంది పార్టీ నేతలు పదవుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

వీరికి పోస్టుల పంపిణీ ఒక ఎత్తయితే ఆ పదవుల పందేరం ఫలితంగా ఎదుర్కొనే పరిస్థితులను సమన్వయం చేయాల్సి ఉండడం పెద్ద టాస్క్‌ అనే చర్చ గాందీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. పదవుల పంపిణీతో పాటు పాలనా వ్యవహారాలపై దృష్టి సారించి తనదైన మార్కు పరిపాలన అందించడం కోసం రేవంత్‌ జోడెడ్ల స్వారీ చేయాల్సిందేనని  రాజకీయ వర్గాలు అంటున్నాయి. 

ఢిల్లీనే కీలకం...: రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం మొదలు నుంచి సీఎంగా ఎంపికయ్యేంతవరకు కాంగ్రెస్‌ పార్టీలోని కొందరు నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ కొందరు నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం వద్ద పట్టుపట్టి తామూ కీలకం అన్న ’గుర్తింపు’సాధించడంలో సఫలీకృతులయ్యారన్న వాదనలూ ఉన్నాయి. ఇందుకోసం అధిష్టానం పెద్దలు కూడా సహకరించారనే చర్చ జరుగుతోంది.

రేవంత్‌రెడ్డి నాయకత్వం పట్ల ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో ఏకాభిప్రాయంతో కూడిన సానుకూలత ఉన్నప్పటికీ సొంత పార్టీలోని కొందరు నాయకుల వైఖరి ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు అడ్డంకి కాకూడదన్న ఆలోచనతోనే హైకమాండ్‌ రాజీధోరణిని అందిపుచ్చుకుందని గాంధీభవన్‌ వర్గాలంటున్నా యి. ఈ ధోరణి మరికొన్నాళ్లు కొనసాగుతుందని, పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, తనదైన మార్కు వేసేంతవరకు పార్టీలోని సీనియర్లతో సీఎం రేవంత్‌కు సమన్వయం తప్పదని చెపుతున్నాయి. 

ఠాక్రేతో పాటు సీనియర్లను సమన్వయం చేసుకునే..  
ఇప్పటికే మంత్రివర్గం కూర్పు, శాఖల పంపిణీలో కాంగ్రెస్‌ పార్టీలో అధిష్టానం మార్కు రాజకీయాలు స్పష్టం కాగా, భవిష్యత్తులో జరిగే నామినేటెడ్‌ పదవుల పంపకంలోనూ హైకమాండ్‌ జోక్యం ఉంటుందని చెబుతున్నారు. హైకమాండ్‌ సూచనల మేరకు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతల ప్రతిపాదనలపై ఆయన సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పదవుల పందేరం కోసం రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్‌ నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని అధిష్టానం ప్రతిపాదించిందని సమాచారం.

>
మరిన్ని వార్తలు