సాధారణ ఫ్లూనే దేశంలో దడపుట్టిస్తోంది.. తేలికగా తీసుకోవద్దు!

7 Mar, 2023 11:37 IST|Sakshi

ఢిల్లీ: ప్రస్తుతం దేశంలో విజృంభిస్తోంది సాధారణ ఫ్లూ అయినప్పటికీ.. అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా. కరోనా కాకున్నా ఆ వైరస్‌లానే H3N2 ఇన్‌ఫ్లూయెంజా ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోందని హెచ్చరిస్తున్నారాయన. పండుల సీజన్‌ వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారాయన.  మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. 

దేశంలో ప్రస్తుతం కొత్త ఫ్లూ విజృంభిస్తోంది. జ్వరాలు దడపుట్టిస్తున్నాయి. దగ్గు, జలుబు, తీవ్ర జ్వరంతో జనాలు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వైరస్ పరివర్తన చెందడం, ప్రజల రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరుగుతున్నాయని డాక్టర్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. చాలా ఏళ్ల కిందట.. H1N1 కారణంగా స్వైన్‌ ఫ్లూ మహమ్మారి విజృంభించింది. ఇప్పుడు H3N2 వైరస్‌ విజృంభిస్తోంది. ఇది ఒక సాధారణమైన ఇన్‌ఫ్లూయెంజా జాతి. ప్రతీ వైరస్‌ లాగే.. ఇదీ పరివర్తనం చెందుతోంది. కానీ,  H3N2 మ్యూటేషన్‌తో ఇన్‌ఫెక్షన్‌ త్వరగతిన వ్యాపిస్తూ.. ఎక్కువ కేసులను చూడాల్సి వస్తోంది. శ్వాస కోశ ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని చెప్తున్నారాయన.

ఈ నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో మాస్కులు వాడాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. కరోనా టైంలో పాటించిన జాగ్రత్తలను పాటిస్తే.. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చిన చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇష్టానుసారం యాంటీ బయోటిక్స్‌ వాడొద్దని ఇదివరకే ఐసీఎంఆర్‌ ప్రజలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.  వృద్ధులు, చిన్నారులతో పాటుగా గుండె, కిడ్నీ, ఇతరత్ర వ్యాధులు ఉన్నవాళ్లు సైతం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు