Indore Smart Polling Station: ‘స్మార్ట్‌’ పోలింగ్‌ స్టేషన్‌ ప్రత్యేకతలేమిటంటే?

18 Nov, 2023 10:06 IST|Sakshi

ఇండోర్‌: ఓటర్లు క్యూలో నిలబడే అవసరం లేకుండానే ఓటేయొచ్చు.., అక్కడే సిరా గుర్తున్న వేలు చూపుతూ కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కెమెరా ద్వారా సెల్ఫీ తీసుకోవచ్చు..! మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఏర్పాటు చేసిన స్మార్ట్‌ పోలింగ్‌ బూత్‌ ప్రత్యేకతలివీ. నంద నగర్‌ నియోజకవర్గంలోని ‘మా కనకేశ్వరి దేవి’గవర్నమెంట్‌ కాలేజీ బూత్‌లో ఈ ఏర్పాటును అందుబాటులోకి తెచ్చారు. ‘ఓటర్ల క్యూ పెద్దగా అవసరం లేకుండా చేసేందుకు ఆన్‌లైన్‌ టోకెన్‌ విధానాన్ని తీసుకొచ్చాం.

పోలింగ్‌ బూత్‌కు వచ్చిన వెంటనే ఓటర్లకు టోకెన్లు అందజేశాం. దీంతో, తమ వంతు వచ్చే వరకు వారు పోలింగ్‌ బూత్‌ వద్దే కూర్చోవచ్చు’అని రాష్ట్ర ప్రభుత్వ ఇండోర్‌ స్మార్ట్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్లానర్‌ రుపాల్‌ చోప్రా పీటీఐకి చెప్పారు. ‘పోలింగ్‌ స్టేషన్‌ ఆవరణలోనే ఏఐ ఆధారిత కెమెరాను ఏర్పాటు చేశాం. ఓటేసిన వారు ఆ పాయింట్‌ వద్ద నిలబడి ఇంక్‌ గుర్తున్న వేలిని చూపితే చాలు వెంటనే కెమెరా క్లిక్‌మనిపిస్తుంది’అని ఆమె వివరించారు.

‘అక్కడే ఉన్న స్క్రీన్‌పై బార్‌ కోడ్‌ ప్రత్యక్షమవుతుంది. ఓటర్‌ తన ఫోన్‌తో స్కాన్‌ చేస్తే ఫొటో వెంటనే మొబైల్‌లోకి వచ్చేస్తుంది. సోషల్‌ మీడియాలోకి సైతం షేర్‌ అవుతుంది’అని రుపాలి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు