కరోనా బెడ‍్ల స్కాం .. తెరపైకి బీజేపీ ఎంపీ?

8 May, 2021 13:40 IST|Sakshi

బెంగళూరు:  ఒక పక్క దేశంలో కరోనా విలయం  కొనసాగుతోంది. మరోపక్క ఆసుపత్రిలో బెడ్లు దొరకక,  ఆక్సిజన్‌  కొరతతో కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భారీ  స్కాం  వెలుగులోకి వచ్చింది. గళూరులో భారీ ఎత్తున ఆస్పత్రి బెడ్ల కుంభకోణం జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మద్దతుదారులున్నారని, వారి సాయంతో ఆస్పత్రులలో బెడ్లను బ్లాక్‌ చేయించి పెద్దమొత్తం లో సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. 

నేత్రావతి, రోహిత్ కుమార్, డాక్టర్ రిహాన్, బొమ్మనహళ్లికి డాక్టర్ శశి కుమార్ లను అదుపులోకి తీసుకున్న  పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం జరిపిన వైద్య పరిక్షల్లో డాక్టర్‌ రోహిత్‌ కు కరోనా పాజిటీవ్‌ రావడంతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు జోన్లలో పనిచేస్తున‍్న వారిలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మద్దతుదారులపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టామని సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన 17 మందిని ప్రశ్నించామనీ, అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. దీనిపై  మరింత దర్యాప్తు  చేయనున్నామని వెల్లడించారు.

80 శాతం ప‍్రైవేట్‌ ఆస్పత్రి బెడ్లని కరోనా పేషెంట్లకు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఉత‍్తర్వులు జారీ చేసింది. అయినా కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ఆస్పత్రులో బెడ్లు కరువయ్యాయి. దీంతో కరోనా బాధితులకు అండగా ఉండే బెడ్ల కేటాయింపు జరగాలని.. ఆ ప్రక్రియను బృహత్ బెంగళూరు మహానగర పాలక మున్సిపల్‌ శాఖకు అప్పగించింది. మున్సిపల్‌ అధికారులు సిటీ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న తొమ్మిది జోనల్‌ స్థాయిలలో కరోనా వార్‌ రూమ్‌ లను ఏర్పాటు చేసింది. వార్‌ రూమ్‌ లలో ఉన్న బెడ్లను బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తన పలుకబడిని ఉపయోగించి  బ్లాక్‌ చేయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బెడ్లను డిమాండ్‌ తగ్గట్లు కేటాయించి, సొమ్ము చేసుకున్నారని అందుకు సంబంధించి ఓ నలుగురు హెల్ప్‌ చేస్తున్నారనే వాదనలు తెరపైకి వచ్చాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు