పట్టు వదలక.. పది పరీక్షకు హాజరైన మాజీ సీఎం

19 Aug, 2021 13:24 IST|Sakshi

చండీగఢ్‌: చదువుకోవడానికి వయసుతో పని లేదని నిరూపిస్తూ 86 ఏళ్ల వయసులో ఓ వ్యక్తి పదో తరగతి పరీక్షలు రాశాడు. అలా రాసింది ఎవరో కాదు ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. మీరు విన్నది నిజమే. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలా బుధవారం పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్షకు హాజరయ్యారు. జేబీటీ రిక్రూట్‌మెంట్ కేసులో 2013లో ఆయనకు  10ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

చౌతాలా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూనే పదో తరగతి పరీక్షలు కూడా రాశారు. అయితే అప్పుడు ఇంగ్లీష్ పరీక్ష రాయలేదు. ఆ తర్వాత హర్యానా ఓపెన్‌ ఎడ్యుకేషన్ బోర్డు 12వ తరగతి పరీక్షలు రాశారు. ఆగస్టు 5న ఆ పరీక్షల ఫలితాలు రాగా చౌతాల ఫలితాన్ని బోర్డు నిలిపివేసింది. పెండింగ్‌లో ఉన్న ఆయన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష పూర్తి చేస్తేనే ఫలితాన్ని వెల్లడిస్తామని తెలిపింది.

దీంతో ఆయన సిర్సాలోని ఆర్య కన్య సీనియర్‌ సెకండరీ స్కూల్‌ పరీక్ష కేంద్రంలో ఇంగ్లీష్ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా... తాను ప్రస్తుతం విద్యార్థినని, రాజకీయాలకు సంబంధించినవి మాట్లాడటానికి నిరాకరించారు. కాగా, చౌతాలా ఓ సహాయకుడిని పెట్టుకోవడానికి బోర్డును అభ్యర్థించి అనుమతి పొందీ పరీక్ష పూర్తి చేశారు. 2017లో తన 82 ఏండ్ల వయస్సులో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌లో 10వ తరగతి పరీక్ష రాసి 53.4 శాతం మార్కులు సాధించారాయన.

మరిన్ని వార్తలు