జశ్వంత్‌ సింగ్‌ కన్నుమూత

28 Sep, 2020 04:20 IST|Sakshi

మొదట ఆర్మీలో, తరువాత రాజకీయాల్లో దేశసేవ

కేంద్రంలో ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలను సమర్థంగా చేపట్టిన నేత

వాజ్‌పేయికి అత్యంత సన్నిహితుడు

రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ నివాళులు

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జశ్వంత్‌ సింగ్‌(82) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. చాన్నాళ్లుగా ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మాజీ ఆర్మీ అధికారి అయిన జశ్వంత్‌ సింగ్‌ మాజీ ప్రధాని అటల్‌ బిçహారీ వాజ్‌పేయికి సన్నిహితుల్లో ఒకరు. జశ్వంత్‌ సింగ్‌ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, పార్టీలకతీతంగా పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

కేంద్రంలో ఆయన ఆర్థిక, రక్షణ, విదేశాంగ తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 2014లో తన ఇంట్లో ఆయన కింద పడి, తీవ్రంగా గాయపడడంతో ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ వైద్యశాలలో చేర్చి చికిత్స చేశారు. ఆ తరువాత కూడా పలు అస్వస్థతలతో  ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ జూన్‌లో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ‘కేంద్ర మాజీ మంత్రి, మేజర్‌(రిటైర్డ్‌) జశ్వంత్‌ సింగ్‌ సెప్టెంబర్‌ 27 ఉదయం 6.55 గంటలకు మరణించారు. 25 జూన్, 2020లో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి సెప్సిస్, మల్టీ ఆర్గాన్‌ డిస్‌ఫంక్షన్‌ సిండ్రోమ్, గతంలో తలకు తగిలిన దెబ్బకు చికిత్స అందిస్తున్నాం. ఆదివారం ఉదయం తీవ్రస్థాయిలో గుండెపోటు వచ్చింది.

ఆయనను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు’ అని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రి ఒక ప్రకటనలో వివరించింది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. జశ్వంత్‌ సింగ్‌ కుమారుడు మానవేంద్ర సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ సైనికుడు, సమర్థుడైన పార్లమెంటేరియన్, అద్భుతమైన నాయకుడు, మేధావి అయిన జశ్వంత్‌ సింగ్‌ మృతి తననెంతో కలచివేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. దేశానికి జశ్వంత్‌ సింగ్‌ ఎన్నో సేవలందించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.  మానవేంద్ర సింగ్‌కు ప్రధాని ఫోన్‌ చేసి సంతాపం తెలిపారు. జశ్వంత్‌ తనకు అత్యంత సన్నిహితుడైన సహచరుడని బీజేపీ సీనియర్‌ నేత అడ్వాణీ పేర్కొన్నారు.  

రెండు సార్లు బీజేపీ నుంచి బహిష్కరణ
1938 జనవరి 3న రాజస్తాన్‌లోని బార్మర్‌ జిల్లా, జాసోల్‌ గ్రామంలో జశ్వంత్‌ సింగ్‌ జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ఆర్మీలో చేరారు. అనంతరం రాజీనామా చేసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రారంభం నుంచీ బీజేపీలో ఉన్నారు. ఎంపీగా పలు పర్యాయాలు పనిచేశారు.   సభలో పదునైన గళంతో స్పష్టంగా తన అభిప్రాయాలను వెల్లడించేవారు. జశ్వంత్‌ సింగ్‌ రెండుసార్లు పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు. ‘జిన్నా– ఇండియా, పార్టిషన్, ఇండిపెండెన్స్‌’ పుస్తకంలో జిన్నాను ప్రశంసించడంతో తొలిసారి 2009లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. 2010లో మళ్లీ ఆయన బీజేపీలో చేరారు. ఆ తరువాత, పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా  లోక్‌సభకు పోటీ చేయడంతో 2014లో మరోసారి ఆయనను పార్టీ నుంచి తొలగించారు.   

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
సాక్షి, అమరావతి: కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సైనికుడి నుంచి పార్లమెంటేరియన్‌గా మారి దేశానికి ఎంతో సేవ చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. జశ్వంత్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.   

>
మరిన్ని వార్తలు