జీ-20 సమ్మిట్: చెహ్లం ఊరేగింపునకు మతం రంగు.. పోలీసులు అలర్ట్‌

7 Sep, 2023 16:02 IST|Sakshi

ఢిల్లీ: జీ-20 వేడుకలకు ముందు జరిగిన చెహ్లం ఊరేగింపునకు మతం రంగు పూస్తున్న సోషల్ మీడియా పోస్టులపై ఢిల్లీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ పుకార్లు అవాస్తవాలని స్పష్టం చేశారు. జీ-20 వేడుకలు శనివారం ప్రారంభం కానుండగా.. బుధవారం ఢిల్లీలో చెహ్లం ఊరేగింపు జరిగింది. దీనిపై ప్రపంచస్థాయి వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేశారా..? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. వీటిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చెహ్లం ఊరేగింపులో కొన్ని మతపరమైన నినాదాలు వినిపించినట్లు, అభ్యంతకరమైన భాషను వాడినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వెలుగులోకి వచ్చాయి. దీంతో జీ-20 వేడుకలకు ముందు ఏదైనా మతపరమైన ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నారా..? అంటూ ప్రచారం కల్పిస్తూ పోస్టులు వెలువడ్డాయి.

 దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఢిల్లీ పోలీసులు..' అవన్నీ అవాస్తవాలు. చెహ్లం ఊరేగింపు, జీ-20 ముందు మతపరమైన ఊరేగింపు అంటూ కొందరు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. చెహ్లం వేడుక సాంప్రదాయంగా, అనుమతుల మేరకు జరుపుకుంటున్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దు.' అని పేర్కొన్నారు. 

చెహ్లం పండగను ఢిల్లీలో షియా ముస్లింలు బుధవారం నిర్వహించారు.  మొహర్రం పండుగ పూర్తి అయిన 40వ నాడు ఈ ఊరేగింపును చేపడతారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానానికి జ్ఞాపకార్థంగా ఈ వేడుక జరుగుతుంది. ఈ పండగ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

జీ20 సదస్సు శని, ఆదివారాల్లో ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనుంది. ఈరోజు రాత్రి 9 గంటలకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. వాహనాలను ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి అనుమతించరు. శనివారం ఉదయం 5 గంటల నుంచి ట్యాక్సీలు, ఆటోలకు ఇవే ఆంక్షలు వర్తిస్తాయి.

ఇదీ చదవండి: జీ20: ఎందుకు.. ఏమిటి!

మరిన్ని వార్తలు