Gujarat Elections: ఆ ఊళ్లో 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారమే లేదు! కానీ.. వంద శాతం ఓటేస్తారు!!

23 Nov, 2022 17:28 IST|Sakshi

గుజరాత్‌లో మొత్తం 186 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 1 నుంచి 5 వరకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ఒక వారం మాత్రమే సమయం ఉ‍న్నందున గుజరాత్‌లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీల హోరుతో రసవత్తరమైన ఎన్నికల టెన్షన్‌తో ఉత్కంఠంగా ఉంది. కానీ, ఆ ఊరిలో మాత్రం ఎలాంటి కోలాహలం లేకుండా సాధారణ వాతావరణం కనిపిస్తుంటుంది. 

గుజరాత్‌లో రాజ్‌కోట్‌ జిల్లాలోని రాజ్‌ సమాధియాల అనే ఒక గ్రామం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడి రాజకీయ పార్టీల ప్రచార ప్రవేశం మాత్రం పూర్తిగా నిషేధం. అసలు అక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచారం జరగదు. అయినప్పటికీ అక్కడి గ్రామస్తులంతా ఓటేస్తారు. అదీ కూడా ఒక్కరు కూడా మిస్స్‌ కాకుండా ఫుల్‌గా ఓట్లు పడతాయి. ఆ గ్రామంలో ఎన్నికల సమయంలో అందరూ అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తుంది అక్కడ గ్రామాభివృద్ధి కమిటీ.

పైగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓటు వేసేందుకు రాకపోతే వారిపై రూ. 51/- జరిమాన కూడా విధిస్తుంది గ్రామాభివృద్ధి కమిటీ. అక్కడ గ్రామ సర్పంచ్‌ని​ కూడా అందరీ ఏకాభిప్రాయంతోనే ఎన్నుకుంటారు. అంతేగాదు పోలీంగ్‌కు కొన్ని రోజుల ముందు కమిటీ సభ్యులు, గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేస్తారు. అక్కడ ఎవరైనా ఓటు వేయకపోతే కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. ఆ గ్రామంలో ఏ రాజకీయ పార్టీలు ప్రచారం చేయకూడదనే నియమం 1983 నుంచి ఉంది. పైగా ఇక్కడ ఏ పార్టీ కూడా ప్రచారం చేసేందుకు రాదని,  ఒకవేళ ప్రచారం చేస్తే తమ భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందని ఆయా రాజకీయ పార్టీలకు కూడా తెలుసుని గ్రామస్తులు చెబుతున్నారు.

ఐతే తమ గ్రామంలో వైఫై ఇంటర్నెట్‌ కనెక్షన్‌, సీసీటీవీ కెమెరాలు, తాగునీరు అందించే ఆర్‌ఓ ప్లాంట్‌ తదితర అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామంలో అభ్యుర్థులను ప్రచారం చేయడానికి అనుమతించరు కాబట్టి గ్రామ ప్రజలంతా తమకు మంచిదని భావించే నాయకుడికే ఏకగ్రీవంగా ఓటు వేస్తారుని ఆ గ్రామ సర్పంచ్‌ తెలిపారు. ఏ కారణం చేతనైనా ఓటు వేయలేని పక్షంలో ముందుగా తమ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. 

(చదవండి: ప్రధాని తప్పు చేస్తే.. చర్యలు తీసుకునే సత్తా ఉన్న సీఈసీ కావాలి: సుప్రీం కోర్టు)

మరిన్ని వార్తలు