పాక్‌ బలహీనంగా ఉంది.. పీఓకేను వెనక్కి తీసుకోండి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

5 Dec, 2022 12:06 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌పై(పీఓకే) కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌. ప్రస్తుతం పాకిస్థాన్‌ బలహీన పరిస్థితుల్లో ఉందని, పీఓకేను వెనక్కి తీసుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పీఓకేను సొంతం చేసుకోవటం మన బాధ్యత అని సూచించారు. పీఓకేను తిరిగి పొందాలనే భారత లక్ష్యం ఎన్నటికీ నెరవేరదని, తమ దేశాన్ని రక్షించుకునేందుకు సైనికులు సిద్ధంగా ఉన్నారని పాక్‌ సైన్యాధిపతిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జనరల్‌ సయ్యద్‌ అసిమ్‌ మునిర్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నేత హరీశ్‌ రావత్‌ పీఓకే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘పీఓకేను పాకిస్థాన్‌ అక్రమంగా ఆక్రమించుకుంది. దానికి ‍స్వేచ్ఛను కల్పించి, తిరిగి తీసుకోవటం మన బాధ్యత. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది. పీఓకేను తిరిగి తీసుకోవటం మోదీ ప్రభుత్వ అజెండాలో భాగమని నమ్ముతున్నాను. కేవలం చర్చలకే పరిమితం కాకూడదు. పాకిస్థాన్‌ ప్రభుత్వం బలహీనంగా ఉంది. పీఓకేను తిరిగి పొందేందుకు ఇదే సరైన సమయం.’ అని పేర్కొన్నారు హరీశ్‌ రావత్‌. 

అంతకు ముందు ఈ ఏడాది అక్టోబర్‌ 28న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం పీఓకేపై సూత్రప్రాయ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలోని శరణార్థులు తిరిగి తమ స్వదేశానికి వస్తారని పేర్కొన్నారు. పీఓకేను తిరిగి పొందేందుకు తమ సైన్యం సిద్ధమవుతున్నట్లు భారత సైన్యాధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది సైతం కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో మహిళా సభ్యురాలిపై చేయి చేసుకున్న ఎంపీ.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు