తగినన్ని ఔషధ నిల్వలు సిద్ధం చేయండి

30 Dec, 2022 05:53 IST|Sakshi

ఫార్మా కంపెనీలకు మన్‌సుఖ్‌ మాండవీయ వినతి 

కోవిడ్‌–19 మేనేజ్‌మెంట్‌ డ్రగ్స్‌ లభ్యతపై సమీక్ష   

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు మరోసారి పెద్దసంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో మనదేశంలోనూ అందరూ అప్రమత్తం కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ గురువారం చెప్పారు. కరోనా నియంత్రణకు అవసరమైన ఔషధాలతోపాటు అన్ని రకాల ఔషధ నిల్వలను సిద్ధం చేయాలని ఫార్మా కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తగినన్ని నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రిటైల్‌ స్థాయి వరకు ఔషధాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

కోవిడ్‌–19 మేనేజ్‌మెంట్‌ డ్రగ్స్‌ లభ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై మంత్రి గురువారం ఫార్మా కంపెనీల ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి విషయంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఫార్మా కంపెనీలు అందించిన సేవలను మన్‌సుఖ్‌ మాండవీయ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఫార్మా కంపెనీల కృషి వల్లే మన దేశానికి అవసరమైన ఔషధాలను, కరోనా టీకాలను ఉత్పత్తి చేసుకోవడంతోపాటు 150 దేశాలకు సైతం ఎగుమతి చేయగలిగామని కొనియాడారు. ధరలు పెంచకుండా, నాణ్యత తగ్గించకుండా ఈ ఘనత సాధించామని హర్షం వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు