జల పర్యాటకం, రవాణాకు పెద్దపీట

30 Dec, 2022 05:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ 

చిన్న బోట్ల నుంచి క్రూయిజ్‌లను నడిపేలా నదీమార్గాల అన్వేషణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకాన్ని ప్రోత్స­హించడంతోపాటు జలరవాణా అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం బోటింగ్‌ టూరిజాన్ని మెరుగుపరుస్తూనే కొత్త జలవనరుల అన్వేషణకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ సంయుక్తంగా పనిచేయనున్నాయి.

ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా నీటివనరులు, బీచ్‌లను పరిశీలించి పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తుంది.

కొత్త నదీమార్గాల అన్వేషణ
రాజమహేంద్రవరం, విజయవాడ, నాగార్జునసాగర్, శ్రీశైలంలో పర్యాటకశాఖ ఎక్కువగా బోటింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లోను అంతర్గత బోట్ల సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తూ బోటింగ్‌ రక్షణకు పెద్దపీట వేయనుంది. మరోవైపు చిన్నచిన్న బోట్ల దగ్గర నుంచి హౌస్‌ బోట్లు, క్రూయిజ్‌లను సైతం నడిపేలా, తీర్థస్థలాలు, వారసత్వ ప్రదేశాలను కలుపుతూ ఉండే నదీమార్గాలను అన్వేషిస్తోంది. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఏపీలో బీచ్‌లను ప్రముఖ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనుంది. 

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఇలా..
ఈ కమిటీకి ఏపీటీడీసీ ఎండీ చైర్మన్‌గా, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ ఈడీ కో–చైర్మన్‌గా, ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో ఏపీ టూరిజం అథారిటీ డిప్యూటీ సీఈవో, ఏపీటీడీసీ ఈడీ (ప్రాజెక్ట్స్), జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీర్, దేవదాయశాఖ జాయింట్‌ కమిషనర్, ఏపీటీడీసీ వాటర్‌ ఫ్లీట్‌ జీఎంలతో పాటు ఏపీటీడీసీ, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ నుంచి ఒక్కో నామినేటెడ్‌ వ్యక్తి సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ ఇతర రాష్ట్రాలతో పాటు బెల్జియం, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో పర్యటించి అక్కడి జల పర్యాటకం, రవాణా సౌకర్యాలను పరిశీలిస్తుంది. సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది. 

గోదావరి, కృష్ణాలోను..
జలమార్గం చౌకైన రవాణా కావడంతో కేంద్రప్రభుత్వం జలమార్గాల అభివృద్ధిపై దృష్టి సారించింది. దేశంలో 50.1 శాతం రోడ్డు, 36 శాతం రైల్వే, 6 శాతం సముద్ర, 7.5 శాతం పైప్‌లైన్‌ రవాణా వ్యవస్థలున్నాయి. జలమార్గ రవాణా 0.4 శాతం మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా 680 మైళ్ల పొడవైన జలమార్గం జాతీయ రహదారులను కలుపుతోంది.

ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మీదుగా ప్రయాణిస్తోంది. కోరమాండల్‌ తీరం వెంబడి కాకినాడ, ఏలూరు, కొమ్మమూరు, బకింగ్‌హామ్‌ కాలువలున్నాయి. ఏపీలో కృష్ణా, గోదావరి నదులు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో జల పర్యాటకం, రవాణా ప్రోత్సాహకానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు