ఆప్‌లోకి కాంగ్రెస్‌ కౌన్సిలర్లు.. గంటల వ్యవధిలోనే సొంత గూటికి..

10 Dec, 2022 11:12 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే పార్టీకి షాక్‌ ఇస్తూ ఢిల్లీ ఉపాధ్యక్షుడు అలీ మెహది, పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఇద్దరు కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పనితీరు నచ్చడం వల్లే వాళ్లు తాము ఆప్‌లో చేరాలని నిర్ణయించుకున్నామని అలీ మెహది చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తామూ భాగస్వాములవుతామన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికలకు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదని పేర్కొన్నారు. 

పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు
ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు అలీ మెహది. తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు శుక్రవారం అర్ధరాత్రి ప్రకటించారు. తాను పెద్ద పొరపాటు చేశానంటూ క్షమాపణలు చెబుతూ ట్విట్టర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తాను రాహుల్‌ గాంధీ నమ్మకస్తుడినైన కార్మికుడిగా పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ముస్తఫాబాద్‌, బ్రిజ్‌పురి కౌన్సిలర్లు సబిలా బేగం, నాజియా ఖాటూన్‌లు సైతం తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. అర్ధరాత్రి 1.25 గంటలకు వీడియో పోస్ట్‌ చేశారు అలీ మెహది.. చేతులు జోడించి ‘నేను పెద్ద పొరపాటు చేశాను. కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాను. నా తండ్రి 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు’ అంటూ పేర్కొన్నారు. పలుమార్లు పార్టీ అధిష్ఠానానికి, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. తనతో వచ్చిన కౌన్సిలర్లు సైతం క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేయాలని కోరారు. 

వీడియో విడుదల చేసిన గంటన్నర తర్వాత మరో ట్వీట్‌ చేశారు అలీ మెహది. ‘బ్రిజ్‌పురి కౌన్సిలర్‌ నాజియా ఖాటూన్‌, ముస్తఫాబాద్‌ కౌన్సిలర్‌ సబిలా బేగం, 300 ఓట్ల మార్క్‌తో ఓడిపోయిన బ్లాక్‌ ప్రెసిడెంట్‌ అలీమ్‌ అన్సారీ ఇప్పటికీ రాహుల్ జీ, ప్రియాంక జీలకు నమ్మకమైన కార్మికులు. రాహుల్‌ గాంధీ జిందాబాద్‌.’ అని పేర్కొన్నారు. వీడియోలో కనిపించిన మరో ముగ్గురు సైతం ఆప్‌ను కలిశారు.

ఇదీ చదవండి: Manneguda Young Woman Kidnap Case: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్‌ రెడ్డి

మరిన్ని వార్తలు