Uttarakhand Tunnel Crash: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్‌

23 Nov, 2023 05:24 IST|Sakshi
బుధవారం టన్నెల్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

57 మీటర్ల శిథిలాల గుండా 45 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తి

మరో 12 మీటర్లు పూర్తయితే కారి్మకులు బయటపడే అవకాశం

నేడో, రేపో తీసుకొచ్చేందుకు అధికారుల ప్రయత్నాలు

ముమ్మరంగా కొనసాగుతున్న ‘ఉత్తర కాశీ’ ఆపరేషన్‌

ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: పది రోజులకుపైగా సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకుతెచ్చే డ్రిల్లింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. దేశ, విదేశీ నిపుణుల పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక, డ్రిల్లింగ్‌ పనుల్లో భారీ పురోగతి కనిపిస్తోందని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్‌ ప్రాజెక్టులో భాగంగా సిల్‌క్యారా వద్ద కొండను తవ్వుతుండగా లోపల 57 మీటర్లమేర సొరంగం కూలిందని సహాయక బృందాలు అంచనావేస్తున్నాయి.

ఇందులో ఇప్పటికే 39 మీటర్లమేర తవ్వగా బుధవారం సాయంత్రానికి మరో ఆరు మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేసి ‘సహాయక’పైపును విజయవంతంగా జొప్పించారు. వీరి అంచనా ప్రకారం మరో 12 మీటర్లు తవ్వితే కారి్మకులు చిక్కుకున్న చోటుకు పైపు చేరుకోవచ్చు. దాదాపు మీటరు వ్యాసమున్న ఈ స్టీల్‌ పైపులోంచి కారి్మకులను బయటకు తీసుకురావాలని ప్రణాళిక సిద్దంచేసిన సంగతి తెల్సిందే.

కార్మికులను బయటకు రాగానే వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించేందుకు ఛాతి డాక్టర్లతో కూడిన 14 మంది వైద్య బృందాన్ని ఘటనాస్థలి వద్ద సిద్ధంగా ఉంచారు. 12 అంబులెన్సులను, 41 పడకల తాత్కాలిక ఆస్పత్రిని సిద్ధంచేశారు. మరీ అత్యవసరమనుకుంటే వారిని వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి ఆగమేఘాల మీద తరలించేందుకు హెలీకాప్టర్‌ను తెప్పించనున్నట్లు సమాచారం.   

బగ్వాల్‌ పండుగ వారితోనూ చేసుకుందాం
‘‘డ్రిల్లింగ్‌ విజయవంతంగా కొనసాగుతోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం. వారితో కలిసే స్థానిక బగ్లాల్‌ పండగ జరుపుకుందాం’’ అని ప్రధాని కార్యాలయం మాజీ సలహాదారు భాస్కర్‌ ఖుల్బే ఘటనాస్థలి వ్యాఖ్యానించారు. దీపావళి పండగ తర్వాత స్థానిక గర్వాల్‌ ప్రాంతంలో బగ్వాల్‌ పండగ జరుపుకోవడం ఆనవాయితీ. అక్కడి బగ్వాల్‌ను ఈ ఏడాది గురువారం జరుపుకుంటున్నారు. మరోవైపు, రెస్క్యూ ఆపరేషన్‌ పురోగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీతో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు.  

సొరంగంలో కూలింది ఎక్కడ ?
సిల్‌క్యారా బెండ్‌ నుంచి మొదలుపెట్టి బార్కోట్‌ వరకు కొండ కింద 4.531 కి.మీ.ల మేర సొరంగం తవ్వుతున్నారు. సిల్‌క్యారా వైపు నుంచి 2.340 కి.మీ.ల మేర సొరంగం తవ్వకం, అంతర్గత నిర్మాణం పూర్తయింది. సొరంగం ముఖద్వారం నుంచి దాదాపు 205–260 మీటర్ల మార్క్‌ వద్ద దాదాపు 57 మీటర్ల పొడవునా సొరంగం కూలింది. అదే సమయంలో ఆ మార్క్‌ దాటి సొరంగం లోపలి వైపుగా కార్మికులు పనిలో ఉన్నారు. అంటే దాదాపు రెండు కిలోమీటర్ల మేర విశాలమైన ప్రాంతంలో కార్మికులు చిక్కుకుపోయారు. 57 మీటర్ల వెడలై్పన శిథిలాలున్నాయి. ఇంతే వెడల్పున శిథిలాల గుండా పైపును జొప్పించి వారిని బయటకు తెచ్చేందుకు యతి్నస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు