నేవీ మాజీ అధికారుల మరణశిక్షపై ఊరట.. భారత్ అప్పీల్‌కు ఖతార్ కోర్టు ఓకే

24 Nov, 2023 09:41 IST|Sakshi

దోహా: భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారుల మరణశిక్ష వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎనిమిది మంది భారతీయులకు విధించిన మరణ శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఖతార్ కోర్టు అనుమతించింది. ఈ మేరకు నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారుల కుటుంబాలకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం అందినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

భారత అప్పీల్‌ను కోర్టు అంగీకరించిందని, ఈ కేసులో తుది నిర్ణయంపై పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే విచారణ తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 

కాగా మరణ శిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాలపాటు సేవలందించారు. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తూ ఇజ్రాయెల్‌ తరపున  ఓ సబ్‌మెరైన్‌ ప్రోగ్రాం కోసం తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడినట్లు వీరిపై ఖతార్‌ ఆరోపణలు మోపింది.
చదవండి: కాల్పుల్లో గాయపడిన భారతీయ విద్యార్థి మృతి

ఈ నేపథ్యంలో 2022 ఆగస్టు 30న ఎనిమిది మంది అధికారులను అరెస్ట్‌ చేశారు. గత అక్టోబర్‌ నెలలో దేశ న్యాయస్థానం వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగరణించింది.

ఎనిమిది మంది మాజీ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించడంపై ఖతార్‌లో అప్పీల్ దాఖలు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి నవంబర్‌ 9న వెల్లడించారు.  ఈ తీర్పు రహస్యంగా ఉందని, న్యాయ బృందంతో మాత్రమే దీనిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తదుపరి చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరణ శిక్ష పడిన వారిలో..కెప్టెన్‌ నవతేజ్‌ సింగ్‌ గిల్‌, కెప్టెన్‌ బీరేంద్ర కుమార్‌ వర్మ, కెప్టెన్‌ సౌరభ్‌, కమాండర్‌ అమిత్‌ నాగ్‌పాల్‌, కమాండర్‌ తివారీ, కమాండర్‌ సుగుణాకర్‌ పాకాల, కమాండర్‌ సంజీవ్‌ గుప్తా, సెయిలర్‌ రాగేగ్‌లు ఉన్నారు. 
సంబంధిత వార్త: అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు

మరిన్ని వార్తలు