అక్కడ హాయిగా పానీపూరీ లాగించేయవచ్చు!

11 Nov, 2020 16:34 IST|Sakshi

పానీ పూరీ, వావ్‌.. ఈ పేరు వినగానే స్ర్టీట్‌ ఫుడ్‌ లవర్స్‌ నోట్లో నీళ్లూరడం ఖాయం. గప్‌చుప్‌, గోల్‌ గప్పా, పానీకే పటాషే... ఇలా ప్రాంతాలను బట్టి పేరెలా మారితేనేం? దీని రుచిని ఆస్వాదించే వారిలో మాత్రం ఈ వంటకంపై ఉన్న ప్రేమాభిమానాలు మాత్రం మారవు. రోడ్డు పక్కన ఆ పానీపూరీ బండి దగ్గర నిల్చుని అలా ఒకదాని తర్వాత మరొకటి, నోట్లో వేసుకొని తింటూ ఉంటే.. ఆహా.. ఆ మజానే వేరుగా ఉంటుంది. కానీ, ఈ లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది కచ్చితంగా ఈ ఫుడ్‌ని బీభత్సంగా మిస్సయ్యే ఉంటారు. అందుకే చాలా మంది దీన్ని ఇంట్లోనే తయారు చేయడం కూడా నేర్చేసుకున్నారు కూడా. అయినా పానీపూరి బండి వద్ద దొరికే రుచి దొరకక ఎప్పుడెప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తారా అంటూ ఎదురుచూశారు. కానీ మహమ్మారి కరోనా భయంతో పాటుగా, ఈ మధ్య బండి వాళ్లు ఇష్టానుసారంగా గోల్‌ గప్పాను తయారు చేస్తున్న విధానాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ దీనిపై ఇష్టాన్ని చంపుకోవాల్సి వచ్చింది. 

ఇలాంటి తరుణంలో ఇండోర్‌లోని స్వచ్ఛ పానీ పూరీ అనే ఒక ఫుడ్‌ స్టాల్‌ సరైన ఇందుకు తగిన పరిష్కారం కనుగొంది. మనుషులతో సంబంధం లేకుండా కేవలం మెషిన్‌తోనే  అన్ని పనులు చక చకా జరిగిపోయేలా, అత్యంత పరిశుభ్రమైన పద్ధతిలో పానీపూరీని తయారు చేసే యంత్రాన్ని రూపొందించింది. ఇందులో, ముందుగానే వారు పూరీని సిద్ధం చేసి పెడతారు. ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు వారంతట వారే మెషిన్‌ ద్వారా పానీని నింపి పూరీ తినవచ్చు. దీంతో సామాజిక దూరం పాటిస్తూ, ఎలాంటి భయం లేకుండా సంతోషంగా పానీపూరిని లాగించేస్తున్నారు అక్కడి కస్టమర్లు. (చదవండి: షాకింగ్‌.. టాయిలెట్‌ నీళ్లతో పానీపూరీ!)

ఇక మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ కేంద్రంగా ఉన్న ఒక ప్రముఖ ఫుడ్‌ బ్లాగింగ్‌ అయిన ఇండోరిజైకా ఈ హైజీనిక్‌ పానీ పూరి యంత్ర వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి, అది పని చేసే తీరును వివరించింది. అంతే ఇక ఆ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసి, మిలియన్‌ వ్యూస్‌తో పాటు 55 వేల లైక్‌లను సంపాదించుకుంది. ఇక పానీ పూరీ ప్రేమికులైతే, ప్లేట్‌ రేటెంత ? ఎక్కడెక్కడ ఈ హైజీనిక్‌ పానీ పూరి దొరుకుతుందా అనే ఉత్సాహంతో ప్రశ్నల వర్షం కురుపిస్తున్నారు. ఏదేమైనా, ఎలాంటి బెదురు లేకుండా ఇక గప్‌చుప్‌గా ఈ గప్‌చుప్‌లను నోట్లో వేసేయొచ్చుఅని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కొల్హాపూర్‌లోని ‘ముంబై కా స్పెషల్‌ పానీ పూరి వాలా’ పేరుతో పానీపూరీ బిజినెస్‌ వాళ్లు, ఇందుకోసం టాయిలెట్‌ నీళ్లను వాడటంతో కస్టమర్లు వారిని చితకబాదిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు