భారీ వర్షాల ఎఫెక్ట్‌.. స్కూల్స్‌ బంద్‌, ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం!

23 Sep, 2022 11:28 IST|Sakshi

దేశవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలమైంది. రెండు రోజులుగా కురుస్తున్న వానల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. మరోవైపు, వాతావరణ శాఖ ఢిల్లీకి ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

ఇక, భారీ వానకు రోడ్లన్నీ జలమయం అవడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. శుక్రవారం కూడా ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుకురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మూడు నుంచి నాలుగు గంటలపాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీవర్షాలతో నోయిడా, గురుగ్రామ్ నగరాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా యూపీ, ఢిల్లీలో 13 మంది మృత్యువాతపడ్డారు. 

మరోవైపు.. భారీ వర్షాల వేళ 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. గురుగ్రామ్ ప్రాంతంలో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని ప్రభుత్వం కోరింది.బ ఇక, గురువారం రాత్రి కుంభవృష్టి కురువడంతో ఢిల్లీ-గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వాహనదారులు తమ ఇళ్లకు చేరుకునేందుకు గంటల సమయం వేచిచూడాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం కూడా దాదాపు ఇదే పరిస్థితులు నెలకొన్నా‍యి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు