75 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు.. పేదలకు సాయం నా లక్ష్యం: ప్రధాని మోదీ

15 Aug, 2022 08:07 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: చరిత్ర విస్మరించిన స్వాతంత్ర్య యోధులను ఇవాళ భారత దేశం గౌరవించుకుంటోంది అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. సోమవారం ఉదయం ఎర్రకోట నుంచి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 

కర్తవ్య మార్గంలో తమ ప్రాణాలను అర్పించిన బాపు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్‌ తదిరత మహోన్నతులకు దేశ పౌరులం కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. దేశం కోసం పోరాడిన వీరనారీమణులకు సెల్యూట్‌. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రముఖులు దేశాన్ని జాగృతం చేశారు.

త్యాగధనుల పోరాటల ఫలితమే మన స్వాతంత్రం. మంగళ్ పాండే, తాత్యా తోపే, భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, చంద్రశేఖర్ ఆజాద్, అష్ఫాఖుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, బ్రిటిష్ పాలన పునాదిని కదిలించిన మన అసంఖ్యాక విప్లవకారులకు ఈ దేశం కృతజ్ఞతలు తెలుపుతోంది. మాతృ భూమి కోసమే అల్లూరి సీతారామరాజు జీవించారు. గిరిజనలు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. 

ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రసంగం..

76th Independence Day ఇవాళ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఆవిష్కరిస్తున్నాం. దేశంలోనే కాదు.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. సంబురాలలో మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతం ఇవాళ ఓ మైలు రాయిని దాటింది. ఈ  75 ఏళ్లు మనం ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నాం.  ఎలాంటి సమస్య వచ్చినా ఓటమిని అంగీకరించలేదు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది.

భారతదేశం తన 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనకు అమూల్యమైన సామర్థ్యం ఉందని నిరూపించుకుంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో, ఆశలు, ఆకాంక్షలు, ఎత్తులు, కనిష్ఠాల మధ్య అందరి కృషితో మేము చేయగలిగిన చోటికి చేరుకున్నాము. 2014లో, పౌరులు నాకు బాధ్యత ఇచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన నాకు.. ఎర్రకోట నుండి ఈ దేశ పౌరులను ప్రశంసించే మొదటి వ్యక్తిగా ఓ అవకాశాన్ని ఇచ్చారు. పేదవాళ్లకు సాయం అందించడమే నా లక్ష్యం. దేశ ప్రజలు పునరుత్తేజంతో ఉండడమే మన బలం. మన ముందు ఉన్న మార్గం కఠినమైంది. ప్రతీ లక్ష్యాన్ని సకాలంలో సాధించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇప్పుడు నవసంకల్పంతో ముందుకు వెళ్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు.  ప్రధాని మోదీలో తొమ్మిదవ సారి నరేంద్ర మోదీ పతాకాన్ని ఆవిష్కరించారు.

వచ్చే 25 ఏళ్లు ఐదు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలి

వచ్చే 25 ఏళ్లులో ప్రధానంగా ఐదు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.  

1. దేశంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి

2. బానిసత్వపు ఆలోచనల్ని మనసులో నుంచి తీసిపారేయండి

3. మన దేశ చరిత్రి, సంస్కృతిని చూసి గర్వ పడాలి

4. ఐకమత్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి

5‍. ప్రతి ఒక్క పౌరుడు తమ బాధ్యతను గుర్తించి పని చేయాలి

మరిన్ని వార్తలు