మరో 392 మంది తరలింపు

23 Aug, 2021 04:21 IST|Sakshi
ప్రత్యేక విమానం దిగి వస్తున్న ప్రయాణికులు (ఇన్‌సెట్లో) వర్షంలో చిన్నారిని పొదివిపట్టుకుని వస్తున్న ఓ వ్యక్తి, జవాను పలకరింపునకు చిన్నారి చిరునవ్వు

భారత్‌కు చేరుకున్న ఇద్దరు అఫ్గాన్‌ చట్టసభ సభ్యులు

న్యూఢిల్లీ: తాలిబన్‌ ముష్కర మూకల కబంధ హస్తాల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్‌ నుంచి తమ పౌరులు, భాగస్వాముల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆదివారం మూడు వేర్వేరు విమానాల్లో 392 మందిని వెనక్కి తీసుకొచ్చింది. వీరిలో ఇద్దరు అఫ్గానిస్తాన్‌ చట్టసభ సభ్యులు సైతం ఉండడం విశేషం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు(ఐఏఎఫ్‌) చెందిన సి–17 సైనిక రవాణా విమానంలో కాబూల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ సమీపంలోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు తరలించిన మొదటి బృందంలో 168 మంది ఉన్నారు.

వీరిలో 107 మంది భారతీయులు కాగా, 23 మంది అఫ్గాన్‌ సిక్కులు, హిందువులు. 87 మందిని శనివారం కాబూల్‌ నుంచి తజికిస్తాన్‌ రాజధాని దుషాన్‌బెకు చేర్చగా, వారిని ఆదివారం ఏఐ 1956 ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారత్‌కు తరలించారు. వీరిలో ఇద్దరు నేపాల్‌ జాతీయులు ఉన్నారు. ఇక మరో 135 మందికిపైగా భారతీయులను కొద్ది రోజుల క్రితం అమెరికా, నాటో విమానాల్లో ఖతార్‌ రాజధాని దోహాకు తరలించారు. వారందరినీ ఇప్పుడు ప్రత్యేక విమానంలో దోహా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. కాబూల్‌ నుంచి తరలించిన వారిలో ఇద్దరు అఫ్గాన్‌ చట్టసభ సభ్యులు అనార్కలీ హోనర్యార్, నరేంద్రసింగ్‌ ఖల్సా, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు అధికార వర్గాలు  తెలిపాయి. కష్టకాలంలో అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  

ఇప్పటిదాకా 590 మంది..
భారత ప్రభుత్వం అఫ్గాన్‌ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 16న ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 590 మందిని వెనక్కి తీసుకొచ్చింది. అమెరికాతోపాటు ఇతర మిత్రదేశాల సహకారం, సమన్వయంతో భారత్‌ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తోంది. సోమవారం కూడా మరో బృందం  భారత్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. ఇండియా వీసాలున్న అఫ్గాన్‌ పౌరులు కాబూల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోకుండా తాలిబన్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరోధిస్తున్నారు.  

 

మరిన్ని వార్తలు