మళ్లీ చైనా దుస్సాహసం

1 Sep, 2020 05:33 IST|Sakshi
సోమవారం లెహ్‌మనాలి హైవే మీదుగా లద్దాఖ్‌ వైపు వెళ్తున్న ఆర్మీ ట్రక్కులు

లద్దాఖ్‌లో యథాతథ స్థితిని భగ్నం చేసేందుకు యత్నం

సమర్థంగా తిప్పికొట్టిన భారత్‌ బలగాలు

డ్రాగన్‌ పన్నాగాలను తీవ్రంగా పరిగణిస్తున్న కేంద్రం

న్యూఢిల్లీ: చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) సరిహద్దుల్లో మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. గల్వాన్‌ ఘటన అనంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో మరోసారి రెచ్చగొట్టేందుకు పీఎల్‌ఏ చేసిన ప్రయత్నానికి భారత్‌ గట్టిగా బదులిచ్చింది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని కొనసాగిం చాలంటూ కుదిరిన ఒప్పందాన్ని కాలరాస్తూ ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి పాంగోంగ్‌ సో సరస్సు దక్షిణం ఒడ్డుకు చైనా బలగాలు చేరుకున్నాయి. పసిగట్టిన భారత సైన్యం వేగంగా స్పందించింది. ఆ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున బలగాలను తరలించి, వారి ప్రయత్నాన్ని వమ్ము చేసింది. అయితే, ఎలాంటి భౌతిక పరమైన ఘర్షణలు చోటుచేసుకోలేదని కేంద్రం తెలిపింది. పాంగోంగ్‌ సో సరస్సు చుట్టుపక్కల అన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో బలగాలను, ఆయుధ సంపత్తిని మరింత పెంచినట్లు వెల్లడించింది.

తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక, దౌత్యవర్గాల మధ్య చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆగస్టు 29/30 రాత్రి పీఎల్‌ఏ బలగాలు యథాతథ స్థితిని మార్చేందుకు రెచ్చగొట్టేలా సైనిక కదలికలకు పాల్పడ్డాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ ఆనంద్‌ తెలిపారు. ‘క్షేత్రస్థాయిలో యథాతథ పరిస్థితులను ఏకపక్షంగా మార్చాలన్న చైనా ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ ప్రాంతంలోని కీలక పోస్టుల్లో బలగాలను సమీకరించడం సహా అన్ని చర్యలు చేపట్టింది’అని కల్నల్‌ ఆనంద్‌ తెలిపారు. ‘పాంగోంగ్‌ సో సరస్సు దక్షిణ ఒడ్డున పీఎల్‌ఏ కదలికలు కనిపించాయి. వెంటనే భారత ఆర్మీ ఆ ప్రాంతంలో బలగాల సంఖ్యను భారీగా పెంచింది. యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఈ వ్యవహారంపై చుషుల్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి’ అని కల్నల్‌ ఆనంద్‌ వివరించారు. ‘శాంతి, సామరస్యాలు కొనసాగేందుకు భారత ఆర్మీ కట్టుబడి ఉంది. అంతే స్థాయిలో, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు కృత నిశ్చయంతో ఉంది’ అని వివరించారు.

ఆగస్టు 29వ తేదీ అర్ధరాత్రి చైనా బలగాలు పెద్ద సంఖ్యలో తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్‌ సో దక్షిణం వైపునకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని, తిష్టవేసేందుకు ప్రయత్నిం చాయి. పసిగట్టిన భారత బలగాలు వారిని నిలువరించేందుకు వెంటనే భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎలాంటి భౌతిక దాడులు చోటుచేసుకోలేదు’అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాంగోంగ్‌ సో సరస్సు ఉత్తర తీరం వైపు రెండు దేశాల బలగాలు గతంలో తలపడ్డాయి. కానీ, దక్షిణం వైపు ఇలాంటి ఘటన జరగడం ఇదే ప్రథమం అని వెల్లడించాయి. ఈ పరిణామంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, త్రివిధ దళాధిపతులు చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

చైనా ప్రయత్నాన్ని ఆర్మీ సీరియస్‌గా తీసుకుందనీ, పాంగోంగ్‌ సో ఉత్తర, దక్షిణ తీరం, చుట్టుపక్కల కీలక ప్రాంతాల్లోకి బలగాలతో పాటు ఆయుధ సంపత్తిని తరలించింది. భారత్‌ గట్టిగా డిమాండ్‌ చేస్తున్న విధంగా ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై చైనా కట్టుబడి ఉన్నట్లు కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.  కాగా, జూన్‌ 15వ తేదీన గల్వాన్‌ ఘటన తర్వాత చైనా కవ్వింపు చర్యలకు పాల్పడటం ఇది మొదటిసారి.     ఉద్రిక్తతలను సడలించుకు నేందుకు ఇరు దేశాలు అంగీకరించినా  పాంగోంగ్‌ సో, డెప్సాంగ్, మరో రెండు ఘర్షణాత్మక ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసుకుని ఉంది. దీంతో భారత్‌ భారీగా  సైన్యాన్ని మోహరించింది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని తరలించింది. మిరేజ్‌–2000, సుఖోయ్‌ 30 ఎంకేఐ వంటి ఫైటర్‌ జెట్లను ఎల్‌ఏసీ వెంట మోహరించింది.

అతిక్రమించలేదు: చైనా
చైనా విదేశాంగ ప్రతినిధి ఝావో లిజియాన్‌ స్పందించారు. చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. ఆ రేఖను వారెప్పుడూ అతిక్రమించలేదు. సరిహద్దుల్లో రెండు వైపుల సైన్యం క్షేత్ర స్థాయి అంశాలపై ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నాయి’ అని వివరించారు. ‘గతంలో అంగీకరిం చిన అంశాలను భారత్‌ ఉల్లంఘించింది. పాంగోంగ్‌ సో సరస్సు దక్షిణతీరంతో పాటు రెకిన్‌ పాస్‌ను ఆగస్టు 31వ తేదీన భారత్‌ బలగాలు అతిక్రమించాయి. తీవ్రమైన రెచ్చగొట్టే చర్య సరిహద్దుల వెంట ఉద్రిక్తతలకు కారణమైంది. చైనా సైన్యం ఇటువంటి వాటిని దీటుగా ఎదుర్కొంటుంది’ అంటూ పీఎల్‌ఏ పశ్చిమ కమాండ్‌ ప్రతినిధి కల్నల్‌ ఝాంగ్‌ షుయిలీ చేసిన ప్రకటనను అధికార జిన్హువా ప్రచురించింది.
 

మరిన్ని వార్తలు