గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి

10 Sep, 2022 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్‌ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్‌స్ప్రింగ్స్‌ పెట్రోలింగ్‌ పాయింట్‌ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్‌ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

వచ్చేవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్‌ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్‌ గల్వాన్‌లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు.

మరిన్ని వార్తలు