1.56 శాతానికి పడిన మరణాల రేటు

2 Oct, 2020 06:15 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విస్తృతి ఆగడం లేదు. అయినప్పటికీ మరణాల రేటు 1.56 శాతానికి పడింది. మరోవైపు, పాజిటివ్‌ కేసుల సంఖ్య 63 లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య లక్షకు చేరువవుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 86,821 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 63,12,584కు చేరింది. అలాగే ఇప్పటివరకు 52,73,201 మంది కరోనా బాధితులు  కోలుకున్నారు. రికవరీ రేటు 83.53 శాతానికి చేరింది. తాజాగా 1,181 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 98,678కి చేరుకుంది. ప్రస్తుతం 9,40,705 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

కేసుల్లో యాక్టివ్‌ కేసులు 14.90 శాతం ఉన్నాయి. మొత్తం రికవరీల్లో 77 శాతం రికవరీలు 10 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. దేశంలో ఆగస్టు 7వ తేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఆగస్టు 23 నాటికి 30 లక్షలకు, సెప్టెంబర్‌ 5 నాటికి 40 లక్షలకు, సెప్టెంబర్‌ 16 నాటికి 50 లక్షలకు, సెప్టెంబర్‌ 28వ తేదీ నాటికి 60 లక్షలకు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 7,56,19,781 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. బుధవారం ఒక్కరోజే 14,23,052 టెస్టులు నిర్వహించినట్లు తెలియజేసింది.

మరిన్ని వార్తలు