తగ్గుతున్న యాక్టివ్‌ కేసులు

10 Oct, 2020 06:23 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఇటీవల 9లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉంటూ ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9లక్షల దిగువకు వచ్చింది. శుక్రవారం 70,496  కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,06,151కు చేరుకుంది. గత 24 గంటల్లో 964 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,06,490 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 59,06,069కు చేరుకుంది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,93,592 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 12.94 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 85.52 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.54 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో సంభవించిన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి  358 మంది మరణించారు. ఈ నెల 8 వరకూ 8,46,34,680 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. గురువారం మరో 11,68,705  పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు