గల్వాన్‌లో మువ్వన్నెల జెండా

5 Jan, 2022 04:40 IST|Sakshi
చైనాతో సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయలో మంగళవారం త్రివర్ణ పతాకం ప్రదర్శిస్తున్న భారత జవాన్లు

ఫొటోలు విడుదల చేసిన భారత రక్షణ వర్గాలు

న్యూఢిల్లీ: లద్దాఖ్‌లోని గల్వాన్‌లోయలో భారీ భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తున్న ఆర్మీ బలగాల ఫొటోలను రక్షణ వర్గాలు విడుదల చేశాయి. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా భారత సైనిక బలగాలు లోయలో భారత జెండాతో ప్రదర్శన నిర్వహించాయి. ఈ లోయ తమ అదీనంలో ఉన్నట్లు చూపుతూ చైనా ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలను తిప్పికొట్టేందుకే భారతీయ రక్షణ వర్గాలు తాజా ఫొటోలు విడుదల చేశాయి.

చైనా బలగాలు చైనా జాతీయ జెండాతో గల్వాన్‌లోయలో ఉన్నట్లు చూపే చిత్రాలను ఆదేశం మూడు రోజుల కిందట విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతం మొత్తం చైనా అధీనంలోకి వచ్చిందన్న దుమారం రేగింది. అయితే ఇవన్నీ చైనా వక్రబుద్ధికి చిహ్నాలని, ఆ ప్రాంతంపై చైనా పట్టు లేదని కేంద్రం వివరణ ఇచ్చింది. చైనా విడుదల చేసిన చిత్రాలు గల్వాన్‌ లోయ అవతలి ప్రాంతంలోనివని, ఫొటోల్లోని ప్రాంతం నిస్సైనిక మండలం దగ్గరలో లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆర్మీ గల్వాన్‌లోయలో ఉన్న చిత్రాలు విడుదలయ్యాయి.

న్యాయశాఖా మంత్రి కిరణ్‌ రిజిజు సైతం తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఈ చిత్రాలను పోస్ట్‌ చేశారు. నూతన సంవత్సర సందర్భంగా గల్వాన్‌లోయలో వీర భారతీయ సైనికులు అని ఫొటోలకు క్యాప్షన్‌ ఇచ్చారు. భారతీయ వర్గాలు విడుదల చేసిన ఫొటోలను ఈనెల 1న గల్వాన్‌లోయలో తీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒక ఫొటోలో అసాల్ట్‌ రైఫిళ్లు ధరించిన దాదాపు 30 మంది భారతీయ సైనికులు జాతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. మరో ఫొటోలో నలుగురు సైనికులు భారతీయ జెండాను ప్రదర్శిస్తున్నారు. ఇందులో డోగ్రా రెజిమెంట్‌ జెండా కూడా కనిపిస్తోంది. నూతన సంవత్సర సందర్భంగా సరిహద్దుల్లో భారతీయ రక్షణ వర్గాలు చైనా సైనికులకు స్వీట్లు పంచి సహృద్భా వం చాటారు. కానీ చైనా మాత్రం కుయుక్తితో నకిలీ ఫొటోలను, అభూత వీడియోను విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు