ఇజ్రాయెల్‌కు ధర్మశాలతో సంబంధం ఏమిటి?

17 Oct, 2023 07:44 IST|Sakshi

ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైనికులు గాజా స్ట్రిప్‌నంతటినీ చుట్టుముట్టారు. ఈ యుద్ధ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదు సోదరులను ఇజ్రాయెల్ వెనక్కి రావాలంటూ పిలుపునిచ్చింది. దీంతో ఇప్పుడు భారతదేశ సందర్శనలో ఉన్న యూదులు తమ స్వదేశానికి తిరిగివెళుతున్నారు. ఫలితంగా మనదేశంలోని ఒక నగరం ఖాళీగా మారిపోతోంది. ఈ నగరం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఆ నగరం గురించి, ఇజ్రాయెల్‌తో ఆ నగరానికున్న అనుబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న నగరం.. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల. ఇజ్రాయెలీలు ఈ నగరంలోని ధర్మ్‌కోట్‌కు వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఇజ్రాయెలీలు సమావేశమవుతారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ యువత ప్రతి సంవత్సరం ఇక్కడకు వచ్చి, చాలా కాలం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఖబద్ హౌస్ కూడా ఉంది. దానిలో ఇజ్రాయెలీలు ప్రార్థనలు చేస్తారు.

ఇజ్రాయెల్‌లోని ప్రతి ఒక్కరూ అంటే యువకులైనా, యువతులైనా సైన్యంలో తప్పనిసరిగా శిక్షణ పొందుతారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత చాలా మంది యువకులు హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ ప్రాంతానికి వచ్చి కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈసారి హమాస్ దాడి వారి విశ్రాంతికి అంతరాయం కలిగించింది.  అనుకోని పరిస్థితుల్లో వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లవలసి వస్తోంది.

భారతదేశానికి వచ్చే ఇజ్రాయెలీలు ధర్మ్‌కోట్‌తో పాటు,  ఢిల్లీలోని పహర్‌గంజ్, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లను కూడా సందర్శిస్తారు. ఇజ్రాయెలీల మతపరమైన స్థలాలు అంటే ఖబద్ హౌస్‌లు ఢిల్లీ, రాజస్థాన్‌లో ఉన్నాయి. ఇజ్రాయెలీలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. యూదుల మత ప్రార్థనా స్థలాలు దాదాపు ప్రతి దేశంలో ఉన్నాయి. ఇక్కడ యూదులు బస చేస్తుంటారు. 
ఇది కూడా చదవండి: ఈవీఎంలోని బటన్లను రెండుసార్లు నొక్కితే ఏమవుతుంది?

మరిన్ని వార్తలు