ఇస్రో దీపావళి ధమాకా

23 Oct, 2022 00:28 IST|Sakshi
నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్తున్న ఎల్వీఎం3–ఎం2  

ఎల్వీఎం3–ఎం2 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌..

వాణిజ్యపరమైన ప్రయోగాల్లో మరో ముందడుగు 

సూళ్లూరుపేట: శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌డీఎస్‌సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్‌ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది.

శనివారం అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్‌సెంటర్‌ రెండో ప్రయోగవేదికగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్‌బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్లను పోలార్‌ లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌(ఎల్‌ఈఓ)లో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్యవిభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్‌ ఇది. బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేటెడ్‌ లిమిటెడ్, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వాములుగా వన్‌వెబ్‌ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు.

వన్‌వెబ్‌ ఇండియా–1 పేరిట 36 ఉప్రగ్రహాలను కక్ష్యలో పంపేందుకు వన్‌వెబ్‌తో న్యూస్పేస్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్‌వెబ్‌ లిమిటెడ్‌ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్‌ సేవలు అందించే గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తోంది.

రాకెట్‌ పేరు మార్చారు 
జీఎల్‌ఎల్‌వీ–ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్‌నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్‌వెహికల్‌ ఎం3–ఎం2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్య(జీటీవో)లోకి శాటిలైట్లను పంపే రాకెట్లకే జీఎస్‌ఎల్‌వీగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్‌ జీటీవోకి పంపట్లేదు. ఎల్‌ఈఓలోకి పంపుతోంది. అందుకే దీనిని వేరే పేరుపెట్టారు. జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్య(జీటీఓ)లోకి 4,000 కేజీల బరువును, ఎల్‌ఈఓలోకి దాదాపు 8,000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్‌వెహికల్‌ ఎం3–ఎం2 రాకెట్‌ సొంతం. 

ప్రయోగం ప్రత్యేకతలు 
►36 శాటిలైట్ల మొత్తం బరువు 5,796 కేజీలు. 
►ఇంతటి బరువును 43.5 మీటర్ల ఎత్తయిన ఒక భారతీయ రాకెట్‌ మోసుకెళ్లడం ఇదే తొలిసారి.  
►ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్‌తో తొలి వాణిజ్యపరమైన ప్రయోగం 
►ఈ రకం రాకెట్‌తో లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాలు పంపడం ఇదే ప్రథమం 

మరిన్ని వార్తలు