‘ఈతరం స్త్రీ పిల్లల్ని కనాలనుకోవడం లేదు’

11 Oct, 2021 13:27 IST|Sakshi

కర్ణాటక మంత్రి నోటి దురుసు

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. 

ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న మహిళా సంఘాలు

బెంగళూరు: మనది పురుషాధిక్య సమాజం. ఇక్కడ చాలా మంది మగవారు మహిళ అంటే కేవలం ఇంటికే.. అందునా వంటింటికే పరిమితం కావాలని భావిస్తారు. వారికంటూ సొంత ఆలోచనలు, ఆశలు, కోరికలు ఉండకూడదని భావిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతి సారి మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు.

వీరిలో సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేదు. స్త్రీ అనగానే వారి నాలుకలు మడతపడతాయి.. మర్యాద వెనక్కి వెళ్తుంది. మహిళలను ఎంత తక్కువ చేసి మాట్లాడితే.. వారికి అంత సంతృప్తి కలుగుతుంది. ఈ కోవకు చెందిన వ్యక్తే కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్‌ కే సుధాకర్‌. ఈతరం ఆధునిక భారతీయ మహిళ ఒంటరిగా జీవించాలని ఆశిస్తుంది.. పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు.. ఇది మంచి పరిణామం కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి.. విమర్శల పాలవుతున్నారు. ఆ వివరాలు..

ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోలాజికల్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి డాక్టర్‌ సుధాకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను మన్నించండి. ఏంటంటే మన దేశ ఆధునిక మహిళ ఒంటరిగా ఉండాలని ఆశిస్తుంది. వివాహబంధానికి దూరంగా ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ పెళ్లి చేసుకున్నా.. పిల్లల్ని కనడానికి ఆమె ఇష్టపడటం లేదు. పిల్లల కోసం సరోగసి విధానాన్ని ఎంచుకుంటున్నారు. మన ఆలోచనలో వచ్చిన ఈ మార్పు మంచిది కాదు’’ అంటూ ఇష్టారీతిగా మాట్లాడారు.
(చదవండి: ‘మగాళ్లకు, మీకు తేడా ఏంటి.. పెళ్లి ఎలా అవుతుంది’)

అంతేకాక ‘‘ప్రస్తుతం మనం విదేశీ సంస్కృతిని అవలంబించడానికి ఉత్సహం చూపుతున్నాం. దానిలో భాగంగా తల్లిదండ్రులను మనతో పాటు ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇది చాలా దురదృష్టకరం’’ అన్నారు. ఆడవారి గురించి మంత్రి సుధాకర్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఏ వేదిక మీద ఉన్నారు.. ఏ కార్యక్రమానికి హాజరయ్యారు.. ఏం మాట్లాడుతున్నారు. ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుందా లేదా చెక్‌ చేసుకొండి అంటూ ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్‌

మరిన్ని వార్తలు