శబరిమల: బాటిల్‌ తిరిగిస్తే డబ్బు వాపస్‌

25 Nov, 2020 16:43 IST|Sakshi

ఔషధ జలం ఇక స్టీల్‌బాటిల్‌లో లభ్యం

కరోనా వ్యాప్తి దృష్ట్యా స్టీల్‌ బాటిల్‌లో పంపిణీ

తిరువనంతపురం: కరోనా దెబ్బకు దేవుడు సైతం చీకటిలో ఉండాల్సిన రోజులు వచ్చాయి. ఎంతో ప్రాముఖ్యత పొందిన కేరళ దివ్య జ్యోతికి ఆటంకం రాకుండా .. సరైన సమయానికి కోవిడ్‌ నిబంధనలతో శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ట్రావెన్​కోర్ దేవస్థాన బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇక నుంచి బాటిళ్లలో సరఫరా చేయనున్నట్లు బోర్డు ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ బాటిళ్లలో నీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఔషధ నీరు బాటిళ్లలో కావాలనుకుంటే రూ.200ను ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నీటిని పంబా బేస్ క్యాంప్​ దగ్గర ఉండే ఆంజనేయ ఆడిటోరియం వద్ద అందిస్తారు. డిపాజిట్‌ చేసిన సొమ్మును బాటిల్ తిరిగి ఇచ్చేసిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఈసారి స్టీల్ బాటిళ్లతో పాటు పేపర్ గ్లాసుల్లోనూ ఈ ఔషధ నీటిని అందజేయనున్నట్లు ట్రావెన్​కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది.

ఔషధ జలం అంటే..?
యాత్రికులు ఎక్కువగా వచ్చే సమయాల్లో అయ్యప్ప భక్తులకు ఔషధాలు కలిపిన నీటిని ఏటా అందిస్తారు. ఛుక్‌ (ఎండు అల్లం), రమాచామ్‌ (వెటివర్), పతి ముఖం (పతంగ కట్ట) వంటి ఆయుర్వేద మూలికలతో నీటిని వేడి చేసి దీన్ని తయారు చేస్తారు. పంపిణీ కేంద్రాల్లోనే ఈ నీటిని తయారు చేసి భక్తులకు ఇస్తారు.  పంబా, చరల్​మేడు, జ్యోతినగర్, మలికప్పురం పాయింట్ల వద్ద ఔషద జలం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా