మూడు లీటర్ల పెట్రోలు, డీజిల్ ఫ్రీ: డీలర్లు గగ్గోలు

19 Jun, 2021 14:43 IST|Sakshi

పెట్రోలు బంకు యజమాని ఔదార్యం

బంపర్‌ ఆఫర్‌, క్యూకట్టిన ఆటో డ్రైవర్లు

311మందికి, లక్ష రూపాయల ఇంధనం పంపిణీ

తిరువ‌నంత‌పురం: దేశంలో రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భగ్గుమంటున్నాయి. అంత‌కంత‌కూ పెరుగుతున్న ఇంధన ధరలు అటు వాహనదారులకు, ఇటు రవాణా సంస్థలకు, ఆటో డ్రైవర్లకు చుక్కలు చూపిస్తున్నాయి.  ఈ తరుణంలో ఆటోడ్రైవర్లకు బంపర్‌ ఆఫర్‌ లభించింది. కేరళలోని ఓ పెట్రోల్ స్టేషన్ వద్ద మూడు లీటర్ల పెట్రోలును ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది.

కర్ణాటక-కేరళ సరిహద్దులోని ఎన్మకాజే గ్రామ పంచాయతీలోని పెర్లాలోని ఫ్యూయ‌ల్ స్టేష‌న్ య‌జ‌మాని ఆటోవాలాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.  311  మందికి మూడు లీట‌ర్ల చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ను ఉచితంగా అంద‌జేశారు. ఈ విషయాన్ని పెట్రోలు పంపు యజమాని అబ్దుల్లా మ‌ధుమోల్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తన గ్రామంలో కేవలం 100ఆటోలు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. అయినప్పటికీ,  చాలా దూర ప్రాంతాలనుంచి వచ్చి తమ ఉచిత ఆఫర్‌ను వినియోగించుకున్నారన్నారు. అంతేకాదు ఆ ఉచిత ఆఫర్‌ను నిలిపివేయాల్సిందిగా ఇతర డీలర్లు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. అయితే అందరూ ఈ విధంగా ఎంతో కొంత సాయం చేయాలని వారికి చెప్పారని, వారి బెదిరింపులు తన సాయాన్ని అడ్డుకోలేవని  వెల్లడించారు. రెండు రోజులపాటు, ల‌క్ష రూపాయ‌ల విలువైన ఇంధనాన్ని అందించినట్టు మ‌ధుమోల్ వివరించారు.  

కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ వేళ ఇబ్బందుల్లో ఉన్న ఆటోడ్రైవర్లను ఆదుకోవాలనే ఉద్దేశం  త‌ప్ప బిజినెస్ ప్రమోషన్‌ కోసం కాదని ఆయన స్పష్టం చేయడం విశేషం. మరోవైపు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఆటో డ్రైవర్లు క్యూ కట్టారు. ఈ ఆఫర్‌పై వారంతా హర్షం వ్యక‍్తం చేశారు. తమ జీవితంలో ఇలాంటి ఆపర్‌ ఎపుడూ చూడలేదంటూ మురిసిపోయారు.  

మరిన్ని వార్తలు