Kerala Nipah Virus Cases: కేరళలో ఐదుకి చేరిన నిఫా కేసులు.. బాధితులతో 706 మంది డైరెక్ట్ కాంటాక్ట్‌

14 Sep, 2023 11:51 IST|Sakshi

కేరళలో ఐదుకి చేరిన నిఫా కేసులు

బాధితులతో 706 మంది డైరెక్ట్ కాంటాక్ట్‌

అధిక ముప్పులో 77 మంది 

తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరో వ్యక్తి వైరస్ బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా 24 ఏళ్ల యువకుడు వైరస్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 706 మంది కాంటాక్ట్ లిస్టులో ఉండగా.. 77 మంది అధిక ముప్పులో ఉన్నారు. వీరిలో 153 మంది హెల్త్ వర్కర్లే కావడం గమనార్హం. ఆస్పత్రిలో 13 మంది స్వల్ప లక్షణాలతో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

హై రిస్క్ జోన్‌లో ఉన్నవారందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల అమలుకు ప్రభుత్వం ఇప్పటికే 19 కోర్ కమిటీలను ఏర్పరిచింది. ఐసోలేషన్‌లో ఉన్నవారికి నిత్యావసరాలు ఇవ్వడానికి వాలంటీర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 

నిఫా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించిన ఏడు గ్రామ పంచాయితీల్లో ఎలాంటి రాకపోకలు జరపరాదని కోజికోడ్ జిల్లా కలెక్టర్ ఏ గీతా తెలిపారు. ఆతన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర గ్రామాలు కంటైన్‌మెంట్‌ జాబితాలో ఉ‍న్నట్లు పేర్కొన్నారు. పోలీసులు ఈ ప్రాంతాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ సమయం తర్వాత దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.  

నిఫా లక్షణాలు..
నిపా ప్రధానంగా మెదడుకు ఇన్ఫెక్షన్‌ కలిగించి, మెదడువాపునకు (ఎన్‌సెఫలోపతి) కారణమవుతుంది. అందుకే తొలుత దీన్ని ఒకరకం మెదడువాపుగా భావించారు. ఒకసారి ఈ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించాక సాధారణంగా సగటున తొమ్మిది రోజుల్లో లేదా మరీ నిర్దిష్టంగా చెప్పాలంటే.. 5 నుంచి 14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. మెదడువాపు కారణంగా తలనొప్పి రావచ్చు. ఈ తీవ్రమైన తలనొప్పి కొందరిలో 24–48 గంటల్లో కోమాకి దారితీయవచ్చు.

వ్యాప్తి ఇలా...
ఇది ప్రధానంగా జంతువుల నుంచి వ్యాపించే వైరస్‌. తాటి జాతికి చెంది డేట్‌పామ్‌ చెట్ల పండ్లపై ఆధారపడే ఒక రకం గబ్బిలాలు (ఫ్రూట్‌ బ్యాట్స్‌)తో ఈ వైరస్‌ వ్యాపిస్తోంది. ఇవి తాటిపండ్లతో పాటు ఇతర పండ్లనూ తింటుంటాయి. జామ వంటి పండ్లు సగం కొరికి ఉన్నప్పుడు దాన్ని చిలక కొట్టిన పండు అనీ, తియ్యగా ఉంటుందని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చిలక్కొట్టినట్టు ఉండే ఏ పండ్లనూ తినకూడదు. పందుల పెంపకం రంగంలో ఉన్నవారిలో ఈ వైరస్‌ ఎక్కువగా కనిపించినందున, అలాంటి వృత్తుల్లో ఉండేవారూ అప్రమత్తంగా ఉండాలి. 

ఇదీ చదవండి: భారత్‌లో నిపా వైరస్‌ కలకలం.. ఇద్దరు మృతి!

మరిన్ని వార్తలు