12న పట్నాలో విపక్షాల కీలక భేటీ!

30 May, 2023 05:37 IST|Sakshi

పట్నా/కోల్‌కతా:  కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్‌ కుమార్‌ తన కార్యాచరణను వేగవంతంగా చేశారు. తమతో కలిసివచ్చే పార్టీల ముఖ్యనాయకులతో రాజధాని పట్నాలో కీలక భేటీ నిర్వహించాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ప్రతిపక్షాల సమావేశం వచ్చే నెల 12న జరిగే అవకాశం ఉందని నితీశ్‌ కుమార్‌కు సన్నిహితుడైన బిహార్‌ మంత్రి విజయ్‌కుమార్‌ చౌదరి సోమవారం చెప్పారు. భేటీ తేదీ దాదాపు ఖరారైనట్లేనని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ హాజరవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి ఏర్పాటుకు నితీశ్‌ కుమార్‌ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు.  

హాజరుకానున్న మమతా బెనర్జీ  
ఈ భేటీకి  పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ నేత చెప్పారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతోపాటు బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆమె సలహాలు సూచనలు ఇస్తారని వెల్లడించారు. పట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన తొలుత మమత నుంచి రావడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట తాము ఆ పార్టీకే మద్దతు ఇస్తామని మమత గతంలో అన్నారు.

మరిన్ని వార్తలు