ఆక్సిజన్ సిలిండర్‌తోనే సివిల్స్‌: రియల్‌ ఫైటర్‌ మూగబోయింది!

16 Jun, 2021 22:46 IST|Sakshi

ఆక్సిజన్‌ సిలిండర్‌తో సివిల్స్‌ రాసిన లతీషా మృతి

తిరువనంతపురం: కేరళలో ఆక్సిజన్ సిలిండర్‌తో 2019లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసిన  లతీషా అన్సారీ మృతి చెందారు. కాగా జూన్ 16 ఉదయం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు.  అరుదైన జన్యు పర వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించడంతో పాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె ఒక పక్క తీవ్రమైన వ్యాధి బాధిస్తున్నా..లెక్క చేయకుండా సివిల్స్‌ పరీక్షను రాసి, వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ధైర్యం మూగబోయింది. అమృతావర్షిణి అనే స‍్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె మృతిపై అమృత వర్షిణి  ఫౌండర్‌  లతా నాయర్  రియల్‌ ఫైటర్‌ అంటూ నివాళులర్పించారు.,

కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(27) పుట్టినప్పటి నుంచి టైప్‌–2 ఆస్టియోజెనెసిస్‌ ఇంపర్‌ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. వీటితో పాటు పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్‌ సిలిండర్‌ అవసరం ఏర్పడింది.  అయినాసివిల్స్‌ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్‌ సిలిండర్‌ల సాయంతో సివిల్స్‌ ప్రాథమిక పరీక్షకు హాజరు కావడం విశేషంగా నిలిచింది.

లతీషాకు ఇతర ఆసక్తులు కూడా ఉన్నాయి. అందులో కీబోర్డ్‌ ప్లే చేయడం. టెలివిజన్‌లో సంగీత ప్రదర్శనతో పాటుగా ఆమె యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహించేది.  లతీషా కొన్ని నెలలు తాత్కాలికంగా ఒక బ్యాంకులో పనిచేసింది, కానీ ఆమె పల్మనరీ హైపర్‌టెన్షన్‌ను తీవ్రతరం కావడంతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వైకల్యం ఉన్న పిల్లల కోసం ఆమె ఇంటి నుంచే ఆమె ఆన్‌లైన్‌లో క్లాసులు  కూడా చెప్పేది.

చదవండి: Novavax సెప్టెంబరుకే, పిల్లలపై ట్రయల్స్‌: సీరం కీలక ప్రకటన 

మరిన్ని వార్తలు