నవంబర్‌ 2న హాజరుకండి

29 Oct, 2023 04:38 IST|Sakshi

ఇక గడువు పొడిగించేది లేదు

ఎంపీ మొయిత్రాకు తెలిపిన ఎథిక్స్‌ కమిటీ

న్యూఢిల్లీ: డబ్బులు తీసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినట్లు వచ్చిన ఆరోపణలపై మౌఖిక సాక్ష్యమిచ్చేందుకు నవంబర్‌ 2న తమ ముందుకు రావాలని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను ఎథిక్స్‌ కమిటీ కోరింది. వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున అక్టోబర్‌ 31కి బదులుగా నవంబర్‌ 5న హాజరయ్యేందుకు అవకాశమివ్వాలని శుక్రవారం ఎంపీ మొయిత్రా ఎథిక్స్‌ కమిటీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

దీనిపై ఎథిక్స్‌ కమిటీ చైర్‌ పర్సన్, బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోంకార్‌ స్పందించారు. పార్లమెంటు, ఎంపీల గౌరవానికి సంబంధించిన అంశమైనందున నవంబర్‌ 2వ తేదీన  తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీని కోరారు. ఆ తర్వాత గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు. కాగా, ఎంపీ మొయిత్రాపై లంచం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ దుబే, మొయిత్రా ఒకప్పటి స్నేహితుడు, లాయర్‌ జై అనంత్‌ దేహద్రాయ్‌ గురువారం ఎథిక్స్‌ కమిటీ ఎదుట  హాజరయ్యారు.

హీరానందానీకి లాగిన్‌ ఐడీ ఇచ్చింది నిజమే
లంచం ఆరోపణలపై ఎంపీ మొయిత్రా పీటీఐతో మాట్లాడారు. తనపై వారిద్దరూ తప్పుడు, పరువు నష్టం ఆరోపణలు చేసినందున కమిటీ ఎదుట హాజరై వాదన వినిపిస్తానన్నారు. అదానీ గ్రూప్‌తో పాటు మోదీని టార్గెట్‌ చేసేందుకు మొయిత్రాకు లంచం ఇచ్చారనే ఆరోపణలను అంగీకరిస్తూ హీరానందానీ ఎథిక్స్‌ కమిటీకి అఫిడవిట్‌ సమర్పించిన విషయం ప్రస్తావించగా..  దీని వెనుక అదానీ గ్రూప్‌ హస్తం ఉందని మొయిత్రా అన్నారు. పార్లమెంటరీ పోర్టల్‌ ఐడీ వివరాలను వ్యాపారి హీరానందానికి  ఇచ్చిన విషయం నిజమేనని ఆమె ఒప్పుకున్నారు. తనకు సౌకర్యంగా ఉండేందుకే ఆయనకిచ్చానే తప్ప, ఈ విషయంలో  ఎటువంటి లాభాపేక్ష లేదని పేర్కొన్నారు. లాగిన్‌ ఐడీ వివరాలను ఇతరులకు వెల్లడించడం దేశ భద్రతకు ప్రమాదకరం అంటూ దుబే  ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు