ఫిరాయింపులపై చర్యలకు గడువుండాలి

13 Jul, 2021 04:26 IST|Sakshi

స్పీకర్ల సదస్సులో చర్చించాం..

ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం

పార్టీ ఫిరాయింపులపై సభాపతి ఓం బిర్లా

19 నుంచి పార్లమెంట్‌

సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులకు సంబంధి ంచిన పిటిషన్లను పరిష్కరించేందుకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలని లోక్‌సభ సభాపతి ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. ఈనెల 19 నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు నిర్వహించనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల వివరాలు వెల్లడించేందుకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై పిటిషన్ల పరిష్కారంలో నిర్ణీత గడువు ఉండాల్సిన అవసరంపై స్పందన కోరగా ‘మీరు మంచి ప్రశ్న లేవనెత్తారు.

పార్టీ ఫిరాయింపుల విషయంలో నిర్ణీత కాలపరిమితి ఉండాల్సిన అవసరం ఉంది. క్రితంసారి స్పీకర్ల సదస్సు జరిగినప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ సదస్సు నివేదికను ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం ఈ దిశగా ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తే నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్ణయం తీసుకునే వీలుంటుంది..’అని సభాపతి పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా ‘ఏదైనా పిటిషన్‌ వచ్చినప్పుడు మా సచివాలయం దానిని పరిశీలిస్తుంది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఆ వివరాలు బహిర్గతం చేయం.. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నియమావళి మేరకు ప్రక్రియ ఉంటుంది.

ఇరుపక్షాల వాదనలు వినాల్సి ఉంటుంది. ఆ తరువాత నిర్ణయం తీసుకుంటాం..’అని పేర్కొన్నారు. అంతకుముందు సభాపతి ఓం బిర్లా మాట్లాడుతూ ఉభయసభలు కోవిడ్‌కు పూర్వం ఉన్న వేళల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏకకాలంలో పనిచేస్తాయని వివరించారు. 280 మంది సభ్యులు సభా ఛాంబర్‌లో, 259 మంది సభ్యులు గ్యాలరీలో కూర్చుంటారని వివరించారు. వ్యాక్సిన్‌ కనీసం ఒక మోతాదులో తీసుకున్న సభ్యులకు ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి కాదని వివరించారు. ఇప్పటికే 411 మంది సభ్యులు టీకాలు తీసుకున్నారని, మిగతా సభ్యులు విభిన్న వైద్య కారణాల వల్ల టీకా తీసుకోలేదని స్పీకర్‌ వివరించారు. టీకా తీసుకోని వారికి పార్లమెంటు భవనంలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు.

కోవిడ్‌ ఆంక్షల కారణంగా సందర్శకులను అనుమతించబోమని సభాపతి తెలిపారు. అన్ని పార్లమెంటరీ వ్యవహారాలు అందుబాటులో ఉండేలా ఒక యాప్‌ రూపొందిస్తున్నామని, మరో పదిహేను ఇరవై రోజుల్లో అందుబాటులోకి వస్తుందని వివరించారు. సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ప్రశ్నోత్తరాలు, చర్చల రికార్డులు అందుబాటులో ఉంటాయని వివరించారు. నిర్ణీత సమయంలోగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పూర్తవుతుందని వివరించారు. పార్లమెంటు లైబ్రరీ, రాష్ట్ర శాసనసభల లైబ్రరీలు ఒకే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. వర్షాకాల సెషన్‌లో మొత్తం 19 రోజులు సమావేశాలు ఉంటాయని వివరించారు. కోవిడ్‌ ఉన్నప్పటికీ 17వ లోక్‌సభ మునుపటి లోక్‌సభలతో పోలిస్తే మొదటి 5 సెషన్లలో రికార్డు స్థాయిలో పనిచేసిందన్నారు. అంతకుముందు ఆయన సెషన్‌ ఏర్పాట్లను, పార్లమెంటు భవన కాంప్లెక్స్‌లో సౌకర్యాలను పరిశీలించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు