ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా గుర్మీత్‌ సింగ్‌ ప్రమాణం

16 Sep, 2021 06:18 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) గుర్మీత్‌ సింగ్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్‌ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి, కేబినెట్‌ మంత్రులు సత్పాల్‌ మహరాజ్, ధన్‌ సింగ్‌ రావత్, అసెంబ్లీ స్పీకర్‌ ప్రేమ్‌ చంద్‌ అగర్వాల్, డీజీపీ అశోక్‌ కుమార్‌ ఇతర అధికారులు హాజరయ్యారు. ఉత్తరాఖండ్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న బేబి రాణి మౌర్య ఇటీవల రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది.

గుర్మీత్‌ సింగ్‌ గతంలో భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా పని చేశారు. ప్రమాణ స్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి సైనికుడిగా సేవలందించాక, ఉత్తరాఖండ్‌కు గవర్నర్‌గా పని చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని అన్నారు. ఉత్తరాఖండ్‌లో దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఓ సైనికుడు ఉన్నాడని, అందుకే రాష్ట్రానికి వీరభూమి అనే పేరుందని అన్నారు. రిటైర్‌ అయిన సైనికులు, ప్రాణాలు కోల్పోయిన సైనికులు, వారిపై ఆధారపడిన వారికి కుటుంబాలకు సాయం అందించడం తన ప్రాధమ్యమని చెప్పారు. గవర్నర్‌ కార్యాలయం ద్వారా ప్రజల అంచనాలను పెంచుతానని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు