ఉదయం 11 వరకే నిత్యావసర షాపులు 

21 Apr, 2021 17:05 IST|Sakshi

షాపుల వద్ద రద్దీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు 

రెస్టారెంట్ల నుంచి రాత్రి 8 వరకే హోం డెలివరీకి అవకాశం 

సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం 

మే 1 వరకు కొత్త నిబంధనలు అమల్లో ఉంటాయని వెల్లడి 

సాక్షి, ముంబై : ఇక నుంచి రాష్ట్రంలో ఉదయం 11 గంటల వరకే నిత్యావసర షాపులు తెరిచి ఉంచాలని  మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ప్రజల అవసరాల దృష్ట్యా గతంలో సడలింపులిచ్చినా షాపుల వద్ద రద్ధీ భారీగా అవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు మే 1వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. బ్రేక్‌ ది చైన్‌లో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూ, 144 సెక్షన్‌ అమలు చేసినప్పటికీ కరోనా కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో నిబంధనలు మరింత కఠినం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తరించడానికి ప్రధాన కారణమవుతున్న రద్దీని నియంత్రించేందుకు ప్రభుత్వానికి ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు. అందులో భాగంగా షాపులు ఏ సమయంలో, ఎన్ని గంటలు తెరిచి ఉంచాలనే దానిపై కొత్తగా నియమావళి జారీ చేసింది. దీంతో సామాన్య ప్రజలు ఇష్టమున్నప్పుడు కాకుండా నిర్ణీత సమయంలోనే ఇళ్ల నుంచి బయటపడతారని ప్రభుత్వం భావిస్తోంది.
  
నిబంధనలు బేఖాతరు చేయడంతో.. 

ఇటీవల ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బ్రేక్‌ ది చైన్‌ అమలు చేసే ముందు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అనేక అంశాలకు సడలింపునిచ్చారు. నిత్యవసర వస్తువులు అంటే కూరగాయలు, కిరాణ షాపులకు భారీగా సడలింపు ఇచ్చారు. కానీ, అక్కడ నిత్యం రద్దీ అవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. అంతేగాకుండా అనేక మంది కిరాణ షాపు, మెడికల్‌ షాపులకు వెళుతున్నామని చెప్పి పోలీసుల చర్యల నుంచి తప్పించుకుంటున్నారు. కిరాణ, మెడికల్‌ షాపులకు వెళుతున్న వారిని అడ్డుకునే అధికారం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం సామాన్యులు, కాలక్షేపం కోసం బయట తిరిగేవారు సునాయాసంగా తప్పించుకుంటున్నట్లు పోలీసులు, బీఎంసీ, ప్రభుత్వ అధికారుల దృష్టికి వచ్చింది.

మరోపక్క రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో నిబంధనలు మరింత కఠినం చేయాలనే డిమాండ్‌ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని కొత్త నియమావళి జారీచేసింది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ నియమాలు మే ఒకటో తేదీ ఉదయం 7 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. ఇందులో ముఖ్యంగా షాపులు, హోటళ్ల సమయాన్ని తగ్గించినప్పటికీ రాత్రి 8 గంటలలోపు హోం డెలివరి చేయడానికి అనుమతిచ్చినింది. దీంతో ఫోన్‌లో సంప్రదించి రాత్రి 8 గంటలలోపే షాపుల నుంచి ఆర్డర్‌ చేసిన సామగ్రిని తెప్పించుకోవల్సి ఉంటుంది.

కొత్త నియమావళి:– 
ఉదయం 7 నుంచి 11 గంటల వరకు 
తెరిచే ఉంచే సంస్థలు, షాపులు.. 

కిరాణ, కూరగాయలు, పండ్లు–ఫలాలు, పాలు, బేకరీ, మిఠాయి–స్వీట్స్, మటన్, చికెన్, ఫిష్‌ మార్కెట్లు, కోడి గుడ్లు, పెంపుడు జంతువుల ఆహారం, పెట్రోల్‌ బంకులు.  పాక్షికంగా, పూర్తిగా మూసి ఉండే సంస్థలు, షాపుల వివరాలు హోటళ్లు, రెస్టారెంట్లు, వైన్‌ షాపులు మూసి ఉంటా యి. కానీ, హోం డెలివరికి అనుమతి ఉంటుంది. అదేవిధంగా వివిధ మతాల ప్రార్థనా మందిరాలు మూసే ఉంటాయి. షాపింగ్‌ మాల్స్, బట్టల మార్కె ట్లు, థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు, ఉద్యాన వనాలు, మ్యూజియంలు పూర్తిగా మూసే ఉంటాయి.

అత్యవసరమైతేనే రావాలి.. 
బెస్ట్, ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు యథాతథంగా తిరుగుగాయి. కానీ, అందులో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులు మాత్రమే రాకపోకలు సాగిస్తారు. ఫోర్‌ వీలర్స్‌ను అత్యవసర సమయంలో మాత్రమే అనుమతిస్తారు. ద్విచక్రవాహనాలను బంధువుల ఇళ్లకు వెళ్లడానికి, వివిధ పనుల నిమిత్తం కాకుండా విధులకు వెళ్లే ఉద్యోగులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అన్ని ప్రైవేటు కార్యాలయాలు మూసే ఉంటాయి. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాస్, టీ విక్రయించే షాపులు మూసి ఉంటాయి. అదేవిధంగా విద్యా సంస్థలు, ప్రైవేటు ట్యూషన్‌ క్లాసెస్‌లు కూడా పూర్తిగా మూసి ఉంటాయి. స్టేడియం, గ్రౌండ్స్‌ కూడా పూర్తిగా మూసి ఉంటాయి. రాజకీయ నాయకుల, పార్టీల సభలు, సమావేశాలు, వివిధ మతాలు, భాషల సాంస్కృతిక కార్యక్రమాలకు, ఆటల పోటీలపై నిషేధం విధించారు. సేతు, ఈ–సేవలు, ఆధార్‌ సెంటర్లు మూసి ఉంటాయి. జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్, మార్నింగ్, ఈవినింగ్‌ వాక్‌లకు నిషేధం విధించారు.

మరిన్ని వార్తలు