ఊరంతా చెత్త.. ఎమ్మెల్యేకు మండింది.. కమిషనర్‌ ఇంటికెళ్లి

27 Jul, 2021 14:35 IST|Sakshi
కమిషనర్‌ ఇంటి ముందు చెత్త వేస్తున్న ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ (ఫొటో: iamabhaypatil Twitter)

బెంగళూరు: ఆయనో నియోజకవర్గానికి ఓ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అన్నీ పనులు దగ్గరుండి చూసుకోవాలి. తాను నివసించే పట్టణంలో శుభ్రంగా చూసుకునే బాధ్యత ఆయనకు ఉంది. అయితే తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పట్టణమంతా ఎక్కడ చూసినా చెత్త ఉంటుండడంతో ఆయనకు మండింది. దీంతో వెంటనే ఓ ట్రాక్టర్‌ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్‌ కమిషనర్‌ ఇంటి ముందు వేశాడు. ఈ సంఘటన స్థానికంగా హట్‌ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకలోని బెళగావి జిల్లా దక్షిణ బెళగావి ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ (బీజేపీ). బెళగావి పట్టణంలో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో వీధులు దర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన ఎమ్మెల్యేకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. బెళగావి పట్టణ మున్సిపల్‌ (బీసీసీ) అధికారులకు బుద్ధి చెప్పేందుకు ఓ ట్రాక్టర్‌ తీసుకుని చెత్త వేసుకుని ఆయనే స్వయంగా నడుపుతూ విశ్వేశ్వరనగరలోని మున్సిపల్‌ కమిషనర్‌ కేహెచ్‌ జగదీశ్‌ ఇంటికి వెళ్లాడు. చెత్తనంతా ఇంటిముందు కుమ్మరించాడు. వాస్తవ పరిస్థితులు ఏమిటో కమిషనర్‌కు చెప్పేందుకే తాను ఈ నిరసన చేపట్టినట్లు ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ మీడియాకు తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే డిప్యూటీ కమిషనర్‌ ఇంటి ముందు కూడా ఇలాగే చేస్తామనని ఎమ్మెల్యే హెచ్చరించాడు. మరి ఇప్పటికైనా అధికారులు మారుతారో లేదో. ఈ బీజేపీ ఎమ్మెల్యే అభయ్‌ పాటిల్‌ గతంలో పలు వింత కార్యక్రమాలతో వార్తల్లో నిలిచాడు. కరోనా పోవాలని పట్టణంలో యాగం నిర్వహించడమే కాక నగరమంతా సామ్రాణి వేయించారు.
 

మరిన్ని వార్తలు