‘నేను ఏం చేస్తానో తెలుసా?’ ఎంపీ కూతురి సమాధానంతో..

28 Jul, 2022 07:27 IST|Sakshi

వైరల్‌: ప్రధాని నరేంద్ర మోదీ పెదాలపై చిరునవ్వులు పూయించింది ఓ చిన్నారి. ఎంపీ అనిల్‌ ఫిరోజియా Anil Firojiya గుర్తున్నాడా? అదేనండీ బరువు తగ్గితేనే(కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున) నియోజకవర్గ నిధులు మంజూరు చేస్తానని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కండిషన్‌ పెట్టడం.. దానిని ఛాలెంజ్‌గా తీసుకుని వర్కవుట్లు చేసి బరువు తగ్గిన వ్యక్తి.

ఉజ్జయిని(మధ్యప్రదేశ్‌) ఎంపీ అనిల్‌ ఫిరోజియా.. తన కుటుంబాన్ని తీసుకుని పార్లమెంట్‌కు వచ్చారు. ఆ సమయంలో ప్రధానిని కలిసింది ఆ కుటుంబం. అనిల్‌ కూతురు ఐదేళ్ల అహానా.. ప్రధాని మోదీతో కాసేపు ముచ్చటించింది. నేనెవరో తెలుసా? అని మోదీ ఆ చిన్నారిని ప్రశ్నించారు. 

అవును.. మీరు మోదీ. రోజూ మీరు టీవీలో కనిపిస్తారు అని చెప్పింది. నేనేం చేస్తానో తెలుసా? అని మోదీ మళ్లీ ప్రశ్నించగా.. మీరు లోక్‌ సభలో పని చేస్తారు అని సమాధానం ఇవ్వడంతో మోదీ నవ్వుల్లో మునిగిపోయారు. చివర్లో మోదీ, అహానాకు ఓ చాక్లెట్ కానుకగా ఇచ్చి పంపించారు. ఈ సరదా విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసుకున్నారు ఎంపీ అనిల్‌.

ఇక యోగా, ఎక్సర్‌సైజులతో 21 కేజీల బరువు తగ్గిన అనిల్‌ ఫిరోజియా.. కేజీకి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున 21 వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు అవుతాయని ఆశిస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రధాని అనిల్‌ను అభినందిస్తూనే.. ఇంకాస్త బరువు తగ్గి ఫిట్‌గా ఉండడంటూ ప్రొత్సహించారు. ఇదిలా ఉంటే.. బరువు తగ్గాలంటూ ప్రధాని మోదీ ఈమధ్య ఇద్దరికి సూచించారు.

ఒకరు ఉజ్జయిని ఎంపీ అనిల్‌ ఫిరోజియా, మరొకరు ఆర్జేడీ నేత, లాలూ కొడుకు తేజస్వి యాదవ్‌. 32 ఏళ్ల తేజస్వి.. ప్రధాని సూచన మేరకు రోజూ కష్టపడి వర్కవుట్లు చేస్తూ ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నాడు కూడా. 

ఇదీ చదవండి: సీఎం షిండేకు షాకిచ్చిన చిన్నారి! 

మరిన్ని వార్తలు